వికారాబాద్/ఆదిబట్ల, నవంబర్ 4 : ఐదు నెలల వేతనాలు రాక ఇబ్బందిపడుతున్న అంగన్వాడీ టీచర్లపై సర్వే పేరుతో మరింత అదనపు భారం వేయడం సరి కాదని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి భారతి, సీఐటీయూ వికారాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, రామకృష్ణ మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు వెంటనే ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వికారాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్ల ఎదుట వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ, రంగారెడ్డి జిల్లా అంగన్వాడీల కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ సెంటర్లలో పని చేస్తున్న టీచర్లకు పూర్తి వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో హెల్పర్స్ను నియమించడంతోపాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనేక పోరాటాల ఫలితంగా మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్ వాడీలుగా గుర్తించి.. రూ.13,650 చొప్పున మూడు నెలలు మాత్రమే చెల్లించారని.. ఆ తర్వాత మళ్లీ మినీ అంగన్వాడీలకు ఇచ్చే వేతనమే ఇచ్చారన్నారు. గత ఐదు నెలలుగా వేతనాలు రాకుంటే ఎలా బతుకుతామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వెంటనే ఆ పెండింగ్ వేతనాలను చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.రెండు లక్షలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ.30 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్కు, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతి పత్రాలను అందజేశారు. ధర్నాలో అంగన్వాడీ యూ నియన్ ప్రాజెక్టుల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మి, కవిత, సంగీత, విజయలక్ష్మి, భారతి, నిర్మల, మంజుల, సరూప, శ్వేత, కమలాదేవి, శాంతి, సునీత, అనసూయ, అంగన్వాడీ టీచర్లు రాధ, వాణి, నవనీత, రేణుక, కల్పన తదితరులు పాల్గొన్నారు.