కడ్తాల్, జూలై 17ః కాంగ్రెస్ మార్క్ పాలన కళ్ల ముందు కనిపిస్తున్నది. పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం, అరెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది, మంత్రుల పర్యటనను అడ్డుకుంటారనే కుంటి సాకుతో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంపై కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజాస్వామిక వాదులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్..
మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ ప్రజాప్రతినిధులు గోపాల్, హరిచంద్‌నాయక్, మహేశ్, నాయకులు పాండునాయక్, అంజితోపాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నేరుగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మండల కేంద్రం సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కస్తూర్బా పాఠశాలను ప్రారంభించేందుకు ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు, ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకుల ధర్నా..
కడ్తాల్ మండలంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులంటే మంత్రులకు ఎందుకంత భయమని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు.
ధర్నాలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌యాదవ్, సువాళీపంతూనాయక్, రమేశ్‌నాయక్, మాజీ సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, జ్యోతయ్య, హరిచంద్‌నాయక్, వెంకటయ్యయాదవ్, బీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు శంకర్, పత్యానాయక్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వీరయ్య, వెంకటేశ్, నరేశ్, బాబా, శ్రీరాములుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు అన్యాయం..
కడ్తాల్ మండల కేంద్రంలో కస్తూర్బా ఆశ్రమ పాఠశాల కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం చేయాలనుకునేలోపే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలను ప్రారంభోత్సవం చేయకుండా మీనమేశాలు లెక్కించింది. కస్తూర్బాగాంధీ పాఠశాలను ప్రారంభోత్సవం చేసి ఈ విద్యా సంవత్సరం వినియోగంలోకి తీసుకొస్తే పేద విద్యార్థులకు చాల మేలు జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడిచిన తర్వాత ప్రారంభించడమేమిటని మాజీ జడ్పీటీసీ ధశరథ్నాయక్తో పాటు మాజీ స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. రాజకీయ కక్షతోనే పేద విద్యార్థులను అన్యాయం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పేర్లు పెట్టాల్సివస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిశాక ప్రారంభోత్సవాలు పెట్టుకుని పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా అని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దశరథ్‌నాయక్ అరెస్ట్‌ను కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ కల్వకుర్తి మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వెంకటేశ్ గుప్త్తా, పత్యానాయక్ తదితరులు ఖండించారు.