సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగుచూసిన బర్మా, బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. చాదర్‌ఘాట్, ఖైరతాబాద్‌లలో పోలీసుల దాడుల్లో 18మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ భారత్‌లోకి బంగ్లా యువతులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆ తర్వాత బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. చాదర్‌ఘాట్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన అరెస్ట్‌ల తర్వాత కొందరు ఏజెంట్లను పోలీసులు విచారించారు. ఆ సందర్భంలో దేశభద్రతకు సంబంధించిన విషయాలు వెలుగుచూడడంతో కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. నగరంలో మూడుకేసులు నమోదవగా వాటిలో సూత్రధారులను ఎన్ఐఏ విచారించింది. ప్రధానంగా బ్యూటీషియన్, టైలరింగ్ .. ఇలా వివిధ వృత్తుల నెపంతో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు బంగ్లా, బర్మా యువతులను హైదరాబాద్‌కు రప్పించి.. వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ మార్గంలో వచ్చిన డబ్బులు బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించింది. ఇది మనీలాండరింగ్ కేసుగా ఈడీని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేశారు. అయితే హైదరాబాద్‌లో ఓలా, ఊబర్ డ్రైవర్లుగా బంగ్లా యువకులు పనిచేస్తూ అమ్మాయిలను చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వలసదారులు నకిలీపేర్లు పెట్టుకుని నగరంలో సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నట్లు గ్రహించిన ఎన్ఐఏ బంగ్లా, బర్మా నుంచి భారత్‌లోకి వీరెలా వచ్చారన్న అంశంపై ఆరా తీస్తోంది. వీరికి హైదరాబాద్ నగరంలోని రోహింగ్యాలు సహకరించినట్లుగా ప్రాథమికంగా తేలడంతో వారి డేటా సేకరించే పనిలో పడింది.
పదిహేనేళ్ల క్రితం దేశంలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌కు వచ్చి ప్రస్తుతం ఇక్కడే ఉంటున్న రోహింగ్యాలు ఎంత మంది ఉన్నారు.. వారెక్కడెక్కడ ఉన్నారనే విషయాలపై ఎన్ఐఏ హైదరాబాద్ పోలీసుల ద్వారా వివరాలు సేకరించే పనిలో పడింది. మొత్తం నగరంలో 6వేల మంది రోహింగ్యాలు ఉండగా.. వారిలో 1000 మంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నారు. వీరంతా ఓల్డ్‌సిటీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. బంగ్లాదేశ్, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి వారికి ఉద్యోగ ఆశలు కల్పించి బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి దించడంలో రోహింగ్యాలు ఆ ఏజెంట్లకు ఎలా సహకరించారు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుగుతోంది. ముఖ్యంగా వీరికి సంబంధించిన డేటా సేకరించడంలో స్థానిక పోలీసుల సహకారంతో ముందుకువెళ్తున్నట్లుగా సమాచారం. బంగ్లాదేశ్ నుంచి యువతులను వెస్ట్ బెంగాల్‌లోని అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి తీసుకొస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రోహింగ్యాలకు సంబంధించిన తాజా సమాచారం వెంటనే తమకు అందించాలని నగర పోలీసులను ఎన్ఐఏ కోరడంతో ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డేటా సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు నగరంలోకి అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాలకు సహకరిస్తున్న ఏజెంట్లపైనా ఎస్బీ, ఎన్ఐఏ ప్రత్యేక నిఘా పెట్టింది. నగరంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో కొందరు అనుమతి పొందినవారు ఉన్నారని, వీరికి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే వీరు కాకుండా అక్రమంగా ఎంత మంది హైదరాబాద్‌లో ఉంటున్నారు… వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులేంటి అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి వీరి పాత్రపై ఎన్ఐఏ విచారణలో కీలకమైన ఆధారాలు లభించాయి.