తాండూరు, మే 31 : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు ఉవ్వెత్తున ఎగసిపడటంతో వేలాది గ్యాలన్ల నీరు నేలపాలైంది. మహబూబ్నగర్-చించోళి నేషనల్ హైవే నం.65 పనులు జరుగుతుండగా.. పొరపాటున పొక్లెయినర్ తగలడంతో పైప్లైన్ పగిలి నీరంతా వృథాగా పారింది. దీంతో తాండూరు నుంచి కొడంగల్ వెళ్లే ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చౌరస్తా సమీపంలోనే పైప్ లైన్ పగలడంతో ప్రత్యామ్నాయ మార్గం లేక కిలోమీటర్ దూరం వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గంటకు పైగా పైప్ లైన్ నుంచి నీరు ఎగసిపడింది. కొందరు మిషన్ భగీరథ పైప్ లైన్ల సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు.