వికారాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ను నల్లగొండ కలెక్టర్‌గా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రతీక్‌జైన్‌ను కలెక్టర్‌గా నియమించింది. గతంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా ప్రతీక్‌జైన్ పనిచేశారు. వికారాబాద్ కలెక్టర్‌గా ఏడాదిన్నరపాటు పనిచేసిన నారాయణరెడ్డి పాలనలో తనదైన ముద్ర వేశారు.
అదేవిధంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌శర్మ కూడా బదిలీ అయ్యారు. ఆయన్ను జయశంకర్భూపాలపల్లి కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికలు ముగియడంతో బదిలీలు షురూ అయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి తహసీల్దార్ల వరకు బదిలీలకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం ముందుగా కలెక్టర్లను బదిలీ చేసింది. త్వరలోనే ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకూ స్థానచలనం జరుగనున్నది.
వికారాబాద్ కలెక్టర్‌గా ఏడాదిన్నరపాటు పనిచేసిన నారాయణరెడ్డి పాలనలో తనముద్ర వేశారు. 2023 జనవరి 31న ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి పాలన ను గాడిలో పెట్టారు. ఉద్యోగులకు అటెండెన్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొ చ్చారు. అధికారులు, ఉద్యోగులతో సఖ్యతగా ఉంటూ జిల్లాను అన్నింటిలోనూ ముందుకు తీసుకెళ్లారు. అసెంబ్లీతోసహా లోక్‌సభ ఎన్నికలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి తానే స్వయంగా శిక్షణనిచ్చి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో.. జిల్లా లో కొత్త ఓటర్లు 50 వేల వరకు పెరిగారు.
అంతేకాకుండా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, తానూ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టక ముందు భారీగా ఉన్న ధరణి దరఖాస్తులు… భూసమ స్యలను పరిష్కరించి రైతులకు మేలు చేశారు. ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి సారించి రికార్డు స్థాయిలో కూలీలు పనులకు హాజరయ్యేలా కీలకంగా వ్యవహరించారు. వేసవిలో ప్రతి కూలీకీ పని కల్పించేందుకు ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం సమయాల్లో వరుసగా 20 రోజులపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో రోజుకు 1.50 లక్షల మంది కూలీలు పనికి వెళ్లేలా చొరవ చూపారు.
అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి స్థలం మార్పులో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని మొదట అనంతగిరిలోని టీబీ శానిటోరియం స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. దీంతో వందలాది చెట్లను నరికివేయాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. తదనంతరం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణరెడ్డి మినీ ఊటీగా పేరొందిన అనంతగిరి అడవిలో ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా శ్రీఅనంత పద్మనాభ కాలేజీ సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని మార్చుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ఆమోదం తెలిపింది.