సరిహద్దుల్లో పహారకాస్తున్న వీరుడికి పుత్రోత్సాహాన్ని నింపే సందేశాన్ని.. కోటి ఆశలతో ఎదురు చూసే నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన విషయాన్ని.. మనసులో మాటని నోరువిప్పి చెప్పలేక కవితల కవ్వింతలతో రాసిన ప్రేమ భావాన్ని.. సెలవులకు పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని పిలుస్తూ కూతురు, అల్లుడికి ఆప్యాయంగా పంపిన కబురును.. క్యాంటీన్ ఖర్చులకు, పుస్తకాలకు డబ్బులు పంపించండి నాన్నగారు అంటూ ఓ కొడుకు రాసిన లేఖలు, ఇలా ఏ భాషలో రాసినా ఆ భావాలను అందించే లేఖ ఇప్పుడు ఏమైంది.. మారుతున్న కాలంతోపాటే కాలగమనంలో కలిసి పోయింది.
Post Card | కులకచర్ల, డిసెంబర్ 11 : కోపంతో నాలుగు మాటలన్నాను.. మనసులో పెట్టుకోకుండా.. మీ అమ్మకోసమైనా ఇంటికి రమ్మంటూ ఓ పితృదేవుడి మమకారపు అర్థింపులను, స్వాతంత్య్ర పోరాటానికి, గెరిల్లా పోరాటాలకు, సాహితీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉత్తరం కాలగర్భంతో కలిసి పోయి, పోస్టు బాక్సులు దిష్టిబొమ్మలుగా మిగిలాయి. గ్లోబలైజేషన్లో వచ్చిన నూతన మార్పు కారణంగా మనిషి దైనందిన జీవితంలో ఊహించలేనంత వేగం పుంజుకున్నది. మధుర జ్ఞాపకాల్లో పోస్టు కార్డు, ఇన్లాండ్ లెటర్లు ఎంత ప్రధానమైనవో.. వాటికి కేంద్ర బిందువైన పోస్టు డబ్బా భూమిక అంతే ప్రధానమైనది.
నాడు ఇంటిళ్లి పాదిముఖాల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, విషాదాన్ని, ప్రేమను, నింపి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయుల అనుభూతులను, ప్రేమలను, ఆశీర్వాదాలను, మోసుకొచ్చే ఉత్తరం కాలక్రమంలో కానరాకుండా పోయింది. వాటి స్థానాన్ని సెల్ ఫోన్, కంప్యూటర్, కొరియర్లు ఆక్రమించాయి. దీంతో ఉత్తరాలు వేసేందుకు అనుకూలంగా ప్రధాన సెంటర్లతో ఏర్పాటు చేసిన పోస్టు డబ్బాలు నిరుపయోగంగా మారాయి. వాటిని ఇటు ప్రజలు గానీ అటు పోస్టల్ శాఖ వారుగానీ పట్టించుకోకపోవడంతో శిధిలావస్థకు చేరాయి. స్పీడ్ యుగానికి అనుగుణంగా మారుతున్నామన్న సంతోషం ఉన్నప్పటికీ మధుర జ్ఞాపకాలకు నిలయమైన పోస్టు డబ్బాను, ఉత్తరాన్ని చూస్తే మనసుకు చిన్న బాధ కలుగుతుంది.
నేటి కాలంలో కంప్యూటర్లు, సెల్ఫోన్ల వినియోగం పెరిగింది. ఉత్తరాలకు బదులుగా మెయిల్ చేస్తున్నారు. ట్విట్టర్లు, వాట్సాప్‌లు ఉపయోగిస్తున్నారు. బిజీ కాలంలో సులువు పనులకు అలవాటు పడిన ప్రజానీకం ఉత్తరానికున్న ప్రత్యేకతను గుర్తించలేక పోతున్నారు. తద్వారా అప్పటికప్పుడు వచ్చిన ఆనందాన్ని మాత్రమే పొందగలుగుతున్నారు.
జీవితానికి, అనుబంధాలకు, ఉత్తరం కిటికీ లాంటిది. సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఉత్తరానిది. ఉత్తరమంటే నాలుగు వ్యాక్యాలు, నాలుగు మడతలు కాదు. ఉత్తరం కనుమరుగు అనేది మానవ జాతికి తీరని లోటు. లేఖ సాహిత్యం అనేది కూడా ఒక ప్రపంచం, అది ఇప్పుడు కనుమరుగవ్వడం బాధాకరం.
– సతీష్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు, సాల్వీడ్ ఉన్నత పాఠశాల
ఉత్తరంలో పొందు పరిచే భావాన్ని కేవలం ఉత్తరంలో మాత్రమే వ్యక్తీకరించగలం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం కొనసాగుతున్న సెల్ ఫోన్ మాటలు అనుభూతిని కల్పించలేవు. తాత్కాలిక ఆనందాన్ని, సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు. సాహిత్య సామ్రాజ్యాన్ని ఏలిన ఉత్తరాన్ని ఎలా మర్చిపోగలం.
– గోపాల్, తెలుగు ఉపన్యాసకులు శ్రీరామలింగేశ్వర డిగ్రీ, జూనియర్ కళాశాల, కులకచర్ల