సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలింగ్ ఏడు గంటల నుంచి ప్రారంభమై ఆరు గంటల వరకు కొనసాగనున్నది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక ఓటరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు తరలించనున్నారు. కాగా ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకోనున్నారు.