ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 13 : గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్నది. మొదటి విడత ఎన్నికలు ఇప్పటికే ముగిసినందున రెండు, మూడో విడుతలో జరిగే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అభ్యర్థులు కదనరంగంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్ పదవి సర్పంచ్ తర్వాత కీలకంగా మారనున్నది. ఉపసర్పంచ్‌ను వార్డు మెంబర్లు అంతా కలిసి ఎన్నుకుంటారు. ఈసారి సర్పంచ్ పదవికి దీటుగా ఉపసర్పంచ్ పదవికి హోరాహోరీ పోరు జరుగనున్నది.
గ్రామ పాలకవర్గంలో సర్పంచ్, ఉపసర్పంచ్ అనేవి జోడు పదవులు. చాలాచోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, జిర్వేషన్లు అమలు తర్వాత పలువురికి అవకాశం చేజారింది. అనుకున్నదంతా తలకిందులు కావడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని భావించిన వారంతా ఉపసర్పంచ్ పదవికోసం ఆరాటపడుతున్నారు. జనరల్ స్థానంలోనూ సర్పంచ్ స్థానానికి ఎక్కువ సంఖ్యలో ఆశావాహుల నుంచి పోటీ నెలకొనడంతో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది.
గ్రామాల్లో ప్యానల్పరంగా ఎవరికి వారు జట్లుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఉపసర్పంచ్ అభ్యర్థులే సర్పంచ్ల కంటే భిన్నంగా దూసుకుపోతున్నారు. రిజర్వేషన్ రూపంలో ఆశలు గల్లంతైనవారంతా ఉపసర్పంచ్ పదవి ద్వారా గ్రామపంచాయతీ పాలకవర్గంలో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. పెద్ద గ్రామపంచాయతీల్లో ఉపసర్పంచ్ పదవికి ఊహించని పోటీ ఏర్పడింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో గెలువాలంటే ఊరంతా తిరిగి అందరిని మచ్చిక చేసుకోవాలి. ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తే సమానంగా ఓటర్లందరికీ చేరేలా జాగ్రత్తపడాలి. ఉపసర్పంచ్ పదవికి అలాంటి తలనొప్పి లేదు.
వార్డు పరిధిలో 200 నుంచి 300 వరకున్న ఓటర్లలో సగం మందిని గుప్పిట్లో పెట్టుకుంటే విజయం సాధించినట్లే.. సగం మంది వార్డు మెంబర్ల గెలుపునకై కృషి చేస్తే మెజార్టీ వార్డు మెంబర్ల సమ్మతితో సులువుగా ఉపసర్పంచ్ అయ్యేందుకు అవకాశాలు నెలకొన్నాయి. వార్డుమెంబర్లుగా పోటీచేసే వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయ నేతల కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉండటానికి ఉపసర్పంచ్ పదవిపై మోజు కారణంగా పలువురు భావిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీల్లో ఆశావహులు వార్డు సభ్యుడిగా గెలిచేందుకు లక్షల్లో ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉంది. నిధుల వినియోగం, బిల్లులు చెల్లింపులో ఇరువురికి సమ ప్రాధాన్యత ఉన్నది. దీంతో సర్పంచ్‌కు దీటుగా ఉపసర్పంచ్‌కు ప్రాధాన్యత ఏర్పడటంతో అనివార్యంగా డిమాండ్ పెరిగింది. గత పాలకవర్గాల్లో చాలా చోట్ల సర్పంచ్‌లుగా పనిచేసినవారికి ఉపసర్పంచ్‌లతో తలనొప్పి ఏర్పడింది. పరిపాలన విషయంలో అనేక పంచాయతీల్లో గొడవలు జరిగాయి. నిధుల దర్వినియోగం విషయంలో ఉపసర్పంచ్‌లతో అడ్డుకట్ట పడినప్పటికీ సర్పంచ్‌లకు మింగుడుపడలేదు.
గ్రామంలో ఏకచత్రాధిపత్యానికి ఉమ్మడి చెక్‌పవర్‌తో ముకుతాడు పడినట్లుగా మారింది. ఫలితంగా రిజర్వేషన్, రాజకీయ పరిణామాలు, గ్రామాభివృద్ధి కమిటీ జోక్యం వంటి కారణాలతో సర్పంచ్ పోస్టుకు పోటీ చేయలేని ఆశావహులంతా వార్డు మెంబర్‌గా పోటీచేస్తున్నారు. తద్వారా ఉపసర్పంచ్ పదవిని చేజిక్కించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది అభ్యర్థులైతే ఉప సర్పంచ్‌లతో భవిష్యత్తులో ఇక్కట్లు ఉండకూడదనే ఆలోచనతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్యానల్‌గా ఏర్పడి తమ వారినే అధిక స్థానాల్లో వార్డు మెంబర్‌గా గెలిపించుకునేందుకు పాటుపడుతున్నారు. అవసరమైతే వార్డు మెంబర్ ఖర్చును సైతం సర్పంచ్ అభ్యర్థులే భరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవి తీవ్ర కీలకంగా మారింది.