సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) ; బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుమన్‌పై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు శనివారం తెలంగాణ భవన్‌కు వచ్చారు. తీవ్ర ఉద్రికత్తలు, హైడ్రామా నడుమ భవన్లో ఉన్న బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఉదయం నుంచే సుమన్‌ను అరెస్ట్ చేస్తారంటూ రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. సుమన్‌ను అరెస్ట్ చేయవద్దంటూ నినాదాలు చేశారు. భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గోబ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మూడురోజులుగా సుమన్ తెలంగాణ భవన్‌లోనే ఉంటున్నారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, భవన్‌లోనే ఉన్నానని సుమన్ ప్రకటించారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడురోజులుగా తెలంగాణ భవన్ వద్దే ఉన్నారు.
బొగ్గుగని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అడ్ పీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుమన్‌పై 3265(జీ),351(3),353(1)(బీ), రెడ్ విత్ 55, రెడ్ విత్ 61(2)(ఏ)బీఎన్ఎస్, 4 పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చారు. సుమన్ లోపల ఉన్నారనే సమాచారంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో భారీగా పోలీసులను అక్కడ మోహరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో భవన్‌కు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమన్‌ను అరెస్ట్ చేసేందుకే పోలీసులు వచ్చారని ఆయన తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాగైనా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్లో పదేళ్ల జైలుశిక్ష పడేలా అక్రమ సెక్షన్లు జోడించారంటూ పోలీసులతో బీఆర్ఎస్ లీగల్‌సెల్ న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారంటూ, దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామంటూ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్‌పై నాంపల్లి పీఎస్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఏసీపీ చెప్పారు. ఈ క్రమంలో భవన్ వద్ద న్యాయవాదులకు, పోలీసులకు మధ్య చర్చలు, వాగ్వాదం జరిగింది. అదే సమయంలో బాల్కసుమన్ భవన్ లోపలి నుంచి కిందకు వచ్చి మీడియాతో మాట్లాడిన అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.