మంచాల, జూలై 3 : ఇండ్లు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేకుంటే మీకు ఇచ్చిన డబుల్‌బెడ్ రూం ఇండ్లలో మీ పేరు ఉండదని కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులను బెదిరిస్తుండగా..మరోపక్క పోలీసులు విచారణ పేరుతో నిత్యం ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించి ఇంటి నంబర్లను కూడా ఇచ్చింది. అయితే అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఇండ్ల విషయాన్ని పట్టించుకోవడం లేదు.
18 నెలలు దాటినా ఆ ఇండ్లలో ఉన్న చిన్న ,చిన్న మరమ్మతులు కూడా పూర్తి చేయకపోవడంతో విరక్తి చెందిన 96 మంది లబ్ధిదారులు పూరి గుడిసెలు, అద్దె ఇండ్లలో ఉండలేక ఇటీవలే తమకు కేటాయించిన ఇండ్లలో సామూహికంగా గృహ ప్రవేశాలు చేశా రు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు లబ్ధిదారులు వెళ్లడాన్ని జీర్ణించుకోని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని.. మిగిలిన పనులను చేయించమంటే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంచాల, లింగంపల్లి, నోముల గ్రామాలకు చెందిన ఇండ్లు లేని నిరుపేదలను అధికారులు సర్వే నిర్వహించి గుర్తించారు. అనంతరం లాటరీ పద్ధతి ద్వారా 96 మందిని ఎంపిక చేసి వారికి బ్లాక్నంబర్తోపాటు ఇంటి నంబర్లను కేటాయించారు. అయితే ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రొసీడింగ్‌లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు న్యాయం కోసం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలను అందించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో జూన్ 23న లింగంపల్లి గేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ధర్నా నిర్వహించారు.
ఇంకా ఇవ్వని ఇండ్ల రిజిస్ట్రేషన్ ప్రొసీడింగ్ కాపీలు
ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు జూన్ 28న పట్టా ప్రొసీడింగ్లతోపాటు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇవ్వడం తో ధర్నా విరమించారు. జూన్ 28న లింగంపల్లి గేట్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే రంగారెడ్డిని డబుల్‌బెడ్ రూముల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరగా.. త్వరలోనే పరిష్కరి స్తామని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మా గోడును పట్టించుకోవడంలేదని..
కరెంట్, తాగునీటి సమస్యలున్నా గత ఆరు రోజులుగా ఆ ఇండ్లలో చీకట్లలోనే ఉంటున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లలో కరెంట్, నీటి కష్టాలు..
లింగంపల్లి గేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కరెంటు, నీటి సమస్యతో లబ్ధిదారులు గత ఆరు రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో విద్యుత్తు లేకపోవడంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లను కేటాయిస్తే అధికారులు చిన్న, చిన్న సమస్యలను పరిష్కరించకపోగా నిత్యం వేధింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం తమకు ఇండ్లిస్తే అధికారులు మాపట్ల ఎందుకు దౌర్జన్యంగా వ్యవహస్తున్నారని కంటతడి పెడుతున్నారు.
ప్రొసీడింగ్ కాపీ ఇవ్వండి
నాకు ఇల్లు లేకపోవడంతో గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ను మంజూ రు చేసింది. దాదాపు రెండేండ్లు కావొస్తున్నా.. ఆ ఇండ్లలో వసతులు కల్పించాలని అధికారులను అడిగి అడిగి అలసిపోయాం. ఇటీవలె డబుల్ బెడ్ రూముల్లోకి 96 మందిమి గృహప్రవేశాలు చేశాం. అధికారులు మా సమస్యలను పట్టించుకుని ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందించాలి.
-అమృత, లబ్ధిదారులు, లింగంపల్లి
సమస్యలు పరిష్కరించండి..
మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించి రెండేండ్లు అవుతున్నది. అయినా, ఇప్పటివరకు అందులో విద్యుత్తు, తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించలేదు. పూరి గుడిసెలు, అద్దె ఇం డ్లలో ఉండలేక ఇటీవలె డబుల్ బెడ్ రూములకు లబ్ధిదారులం అందరం కలిసి వెళ్లాం. ఇప్పుడెమో కాంగ్రెస్ పార్టీ నాయకులొచ్చి ఆ ఇండ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. పోలీసులతో విచారణ పేరుతో ఇబ్బం ది పెడుతున్నారు. చీకట్లో ఉండలేకపోతున్నాం. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి. -గడ్డం బాల్‌రాజ్, మంచాల