బంట్వారం : జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ( DPO Jayasudha ) శుక్రవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. సల్బత్తాపూర్ గ్రామంలో అవేన్యు ప్లాంటేషన్, నర్సరీ, వర్మికాంపోస్టు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీ కార్మికులకు పలు సూచనలు చేశారు. వర్మి కంపోస్టును తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నర్సరీలలో మొక్కలను ( Plants ) జాగ్రత్తగా పెంచాలని, వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. పంచాయతీ కార్మికులకు బూట్లు, గ్లౌసులు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహారం పట్ల అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు 2018 యాక్ట్ పుస్తకాన్ని అందించారు. ఆమె వెంట ఎంపీడీవో రాములు, ఎంపీవో నాగరాజ్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.