శంకర్పల్లి, జూలై 5 : వికలాంగుల పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంతో పాటు వికలాంగుల కార్పోరేషన్ బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం నాడు శంకరపల్లి డిప్యూటీ తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. వికలాంగులు అనేక సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చేయూత పెన్షన్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయకపోవడం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వికలాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుని ప్రతి జిల్లాలో టీసీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేటివ్ చట్టాల సవరణ చేసి స్థానిక గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో వికలాంగుల ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు.
దేశంలో ఇప్పటికే తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నాయి. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ద్వారా తెలియజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు కాసాల యాదయ్య, శంకర్పల్లి మండల అధ్యక్షులు బీర్ల పెద్ద కుమార్, ఎస్ కుమార్, దత్తు, శ్రీనివాస్, శీతల్ సింగ్, జంగయ్య, తదితరులు ఉన్నారు.