యాచారం, జూన్ 4 : మండలంలోని తాటిపర్తి గ్రామంలో చేపడుతున్న ఫార్మా పనులను గురువారం కొందరు రైతులు తమ పొలాల వద్ద అడ్డుకున్నారు. గ్రామానికి వచ్చిన జేసీబీలు, డ్రోజర్లను అడ్డుకొని కోర్టు స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని తిరిగి వాటి ని వెనక్కి పంపించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడి నుంచే పనులు చేయకుండానే తిరిగి వెళ్లిపోయాయి. ఫార్మాసిటీ భూముల్లోకి అధికారులు బలవంతంగా యంత్రాలు తీసుకొచ్చి చదును చేయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
అక్రమంగా రైతుల పొలాల్లోకి వచ్చి విద్యు త్తు సరఫరాను నిలిపివేయడం, భూములను చదును చేయడం, బోరుబావులు, పశుగ్రాసం, పశువుల కొట్టాలను ధ్వంసం చేయడం సరికాదని మండిపడ్డారు. గత మంగళవారమే గ్రామంలోకి జేసీబీలు, డోజర్లు రాకుం డా అడ్డుకున్నామని, అయినా మళ్లీ ఎందుకొచ్చాయని వాహనదారులను ప్రశ్నించారు. మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు ఫార్మాకు ఇవ్వని 2,250ఎకరాల భూముల్లోకి రావొద్దని సూచించారు. ఫార్మాకు ఇవ్వని భూముల్లోకి అక్రమంగా చొరబడి భూములు చదును చేయడం, కరెంట్‌ను నిలిపేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.