Amangal | కడ్తాల్, మే 25 : హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీతముదిరాజ్ కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి స్థానికుల తరఫున వినతిపత్రం అందజేసిన్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా గీత ముదిరాజ్ మాట్లాడుతూ.. నిత్యం ఆమనగల్లు, కడ్తాల్ మండలాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కి రాకపోకలు కొనసాగిస్తారని తెలిపారు. స్థానిక ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని మంత్రిని కోరిన్నట్లు పేర్కొన్నారు. కడ్తాల్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌ను ఏర్పాటు కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. కడ్తాల్-షాద్‌నగర్ మార్గంలో నిలిపిన ఆర్టీసీ బస్సులను వెంటనే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించిన్నట్లు చైర్పర్సన్ తెలిపారు.