సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల తరబడిగా నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గుక్కెడు నీటి కోసం యుద్ధమే చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. జలమండలి పరిధిలో నిత్యం కాలనీలు, బస్తీల్లో ప్రజలు బిందెలతో రోడ్డెక్కుతున్నారు. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటి పోయి.. ఇండ్లలో బోర్లున్న వారు కూడా జలమండలి నీటినే వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ఈ తరుణంలో వినియోగదారులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయాల్సిన అధికారులు.. పూర్తిగా చేతులెత్తేశారు. కనీస ప్రణాళిక లేకుం డా సరఫరా చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో నీటి కటకట విలయ తాండవం చేస్తున్నది. బోర్లు అడుగంటి.. తాగునీటి సరఫరా అరకొరగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ట్యాంకర్లు సైతం బుక్ చేసిన నాలుగు, ఐదు రోజులకు డెలివరీ అవుతుండటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచ ని స్థితిలో జలమండలి వినియోగదారులు కొట్టుమిట్టాడుతున్నారు. రోజుకు వేలాది ట్యాంకర్లను సకాలంలో డెలివరీ చేసేందుకు 24 గంటలు పని చేస్తున్నామని అధికారులు చెప్పుకొంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. తాగునీటి ఎద్దడి, సరఫరాలో అంతరాయం, ట్యాంకర్ల డెలివరీలో ఆలస్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని జలమండలి అధికారులకు పదుల సార్లు ఫిర్యాదులు చేసి నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.
బిందెలు పట్టుకొని..రోడ్డెక్కి నిరసనలు
జలమండలి సరఫరా అరకొరగా సాగుతుండటంతో బస్తీలు, కాలనీలవాసులు అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. బిందెలు పట్టుకుని జలమండలి రిజర్వాయర్లు, డివిజన్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయాల్లో నిరసన తెలుపుతున్నారు. అయినా అధికారుల్లో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాలకు నీళ్లివ్వాలని ఆయా కాలనీల అసోసియేషన్లు, బస్తీల ప్రతినిధులు వినతి పత్రాలిచ్చినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలితోపాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, కవాడిగూడ వంటి ప్రాంతాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. తాజాగా కొండాపూర్‌లోని రాఘవేంద్రకాలనీలో నాలుగు రోజులకొకసారి నీటి సరఫరా అవుతున్నదని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. కవాడిగూడలో మహిళలు రోజుల తరబడిగా నీళ్లు రాకపోవడంతో బిందెలు పట్టుకుని రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ పరిసరాల్లో బస్తీల ప్రజలు నెలల తరబడిగా తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. ఆయా కాలనీల ప్రజలు ట్యాంకర్లను బుక్ చేసుకున్నా.. సకాలంలో రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడిగా నీళ్ల కోసం పోరాటం చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.