కేశంపేట, జూన్ 17 : అంగన్వాడీల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కేశంపేట ఇంచార్జి ఎంపీడీవో కిష్టయ్య అన్నారు. కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ దివ్యసింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘అమ్మ మాట.. అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో పాల్గొని మాట్లాడారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహార లోపం తలెత్తవద్దన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఐసీడీఎస్ కేశంపేట క్లస్టర్ సూపర్వైజర్ దివ్యసింగ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని అన్నారు. అంగన్వాడీల్లో అందజేసే పౌష్టికాహారాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.