రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులతోపాటు కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులకూ ఆసరా పింఛన్లను అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 3,293 మంది కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు లబ్ధిపొందుతున్నారు. వీరికి ప్రతి నెలా రూ.66.38 లక్షల పైచిలుకు పింఛన్లను రాష్ట్ర సర్కార్ అందజేస్తున్నది. వారి జీవితాలకు భరోసా కల్పిస్తుండడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుజ్జీవనం కల్పించుకుంటున్నది. ప్రజా సంక్షేమానికి గత పాలకులు తిలోదకాలిచ్చి జన జీవితాల్ని చిన్నా భిన్నం చేసిన విషయం మనకు తెలియనిది కాదు. వారిని నమ్మిన లక్షలాది మంది తెలంగాణ వాసుల బతుకులు చితికిపోయాయి. పోరాడి గెల్చుకున్న ప్రత్యేక తెలంగాణలో మన బతుకులు మారాలని సీఎం కేసీఆర్ కార్యదీక్షతో సర్వత్రా అభివృద్ధి ప్రణాళికలు రచించి తెలంగాణ పురోభివృద్ధికి చర్యలు చేపట్టారు. తెలంగాణ రాకతో జన జీవనాన్ని పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి బతికించుకుంటున్నం. పలు సంక్షేమ, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ అభివృద్ధికి బాటలు వేస్తున్నరు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. గత పాలకుల హయాంలో కుంటుపడిన పలు సామాజిక వర్గాలకు ప్రభుత్వం ‘ఆసరా’గా నిలబడి కుల వృత్తులను బాగుపరుస్తున్నది. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకొని అనాదిగా అదే వృత్తిలో బతుకున్న గీత, చేనేత, బీడీ కార్మికులకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలబడి నెలవారీ పింఛన్లు అందిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నది.
3,293 మంది కార్మికులకు ‘ఆసరా’..
సామాజిక భద్రతా వ్యూహంలో భాగంగా నిరుపేదలందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన జీవనం అందించాలని, సమాజంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం‘ఆసరా’ పింఛన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే ఈ పథకాన్ని అమలులోకి వచ్చింది. గత ప్రభుత్వాలు రూ.200లను మాత్రమే పింఛన్‌గా ఇచ్చేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జన జీవితాలు వెలుగు వెలిగేలా పింఛన్‌ను రూ.2,016లకు పెంచింది. ‘ఆసరా’ పథకం ద్వారా జిల్లాలో లక్షలాది నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. ఇది సత్యం. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా, డయాలసిస్ పేషంట్లు ఈ పథకం ద్వారా నెలనెలా పింఛన్‌తో లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో 2,04,206 మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం నెలకు జిల్లాలో రూ.48.92 కోట్ల్ల పింఛన్లు మంజూరు చేస్తున్నది. జిల్లాలో కల్లు గీత కార్మికులు 2,449 మంది, చేనేత కార్మికులు 830 మంది, బీడీ కార్మికులు 14 మంది ఉన్నారు. వీరికి బీఆర్ఎస్ ప్రభుత్వం నెలవారీగా రూ. 66,38,688లను పింఛన్‌గా మంజూరు చేస్తున్నది. అశక్తులైన కల్లు గీత, చేనేత, బీడీ కార్మికులు 57 ఏండ్ల పైబడిన వారికి ప్రభుత్వం నెలవారీగా పింఛన్లను మంజూరు చేస్తూ వారికి తోడ్పాటునందిస్తున్నది. భర్త చనిపోతే భార్యకు వెంటనే ఆసరా పింఛన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను ఇటీవలే జారీ చేసింది. పింఛన్ పొందుతున్న ఇంటి పెద్ద చనిపోతే.. ఆ చనిపోయిన వ్యక్తి భార్య (18 ఏండ్లు నిండినవారు) ఆధార్ కార్డు, మృతుడి డెత్ సర్టిఫికెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపించి మృతుడి భార్యకు పింఛన్ మంజూరు చేసేలా ‘ఆసరా’ పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
మనసున్న మారాజు.. కేసీఆర్
రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న ప్రజలు కేసీఆర్‌ను ‘మనసున్న మారాజు, మహానుభావుడు’ అని., బీఆర్ఎస్ ప్రభుత్వం ‘సకల జనుల కోసం ఏర్పడిన ప్రభుత్వం’ అని మరికొందరు., ప్రజలు సీఎం కేసీఆర్‌ను ‘దేవుడు, ఆ సారుకు రుణపడి ఉంటం, మంచి ఆలోచనాపరుడు’ అని కీర్తిస్తున్నరు. తోడూనీడ లేని జీవితాలకు ప్రభుత్వం ‘ఆసరా’గా నిలవాలని పలు రకాలుగా ఉన్నవారిని ఈ పథకంలోకి తీసుకొచ్చి మంచి పని చేసిందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో ఈ పింఛన్లను బ్యాంకుల ద్వారా, ఇంకా పోస్టల్ సేవల ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్నది.
కేసీఆర్ సారు.. మంచి ఆలోచనతోనే పాలిస్తుండు.. : వడ్డేపల్లి జంగయ్యగౌడ్, నల్లచెరువు, మాడ్గుల
నేను గీత కార్మికుల కోటాలో నెలకు రూ.2,016 పింఛన్ తీసుకుంటున్న. తెలంగాణ రాక ముందున్న ప్రభుత్వాలు ఇచ్చే రూ.200 దేనికీ సరిపోయేది కాదు. తెలంగాణ వచ్చినంక, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక రూ.2,016 ఇస్తున్నరు. ఇవే ఇప్పుడు ఆసరా అవుతున్నయి. నా కుటుంబానికి ఉపయోగపడుతున్నయి. కేసీఆర్ సార్ జనానికి, మాలాంటోళ్లకు ఎన్నో ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చిండ్రు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించవు. తోడూనీడ లేని జీవితాలకు ప్రభుత్వం ‘ఆసరా’గా నిలుస్తున్నది. మనసున్న మారాజు. కేసీఆర్ సారు మంచి ఆలోచనాపరుడు.
కేసీఆర్ సారు సల్లగుండాలె.. ప్రధాని కావాలె.. : జె.విజయ్, ఆమనగల్లు
గీత, చేనేత, బీడీ కార్మికులను ఆదుకుంటున్న కేసీఆర్ సారు సల్లగుండాలె. మా అసువంటి చేనేతలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గీ పథకం తీసుకొచ్చుడు చానా బాగుంది. నెలకోసారి సారు పేరు జెప్పుకొని రూ.2,016 తీసుకుంటున్నం. ఏదో రకంగా మా కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతున్నయి. ఎన్నో ప్రభుత్వాలొచ్చినా.. మమ్మల్ని పట్టించుకున్నోడే లేడు. మమ్మల్నే కాకుండా ఎంతో మందిని ఆదుకుంటున్న కేసీఆర్ సారు మంచిగుండాలె. ఆయనిచ్చే నెల పింఛన్‌తోనే ఇంత కలో గంజో తాగుతున్న. వయసు పెరుగుతున్న కొద్దీ కాళ్లు చేతులు ఆడట్లేదు. అందుకేనేమో.. కేసీఆర్ సారు గిట్ల ‘ఆసరా’ అయితుండు. ఇట్ల పెన్షన్ ఇయ్యడం గొప్ప విషయం. కేసీఆర్ సార్ ప్రధాని కావాలె.
దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వారి కోసమే ‘ఆసరా’ : ప్రభాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలలోని నిరుపేద ప్రజలకు అండగా నిలవాలని ‘ఆసరా’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా సమాజంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వారి కోసమే ఈ ‘ఆసరా’ పథకం ప్రజలకు చేరువైంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సామాజిక సంక్షేమ పథకాల్లో అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోయేలా సీఎం కేసీఆర్ కార్యాచరణ చేపట్టారు. ‘ఆసరా’ ద్వారా జిల్లావ్యాప్తంగా 9 రకాల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతున్నది. జిల్లాలో కల్లు గీత, చేనేత, బీడీ కార్మికులు 2,393 మంది ‘ఆసరా’ పెన్షన్లు పొందుతున్నారు. వారిలో గీత కార్మికులు 2,449, చేనేత కార్మికులు 830, బీడీ కార్మికులు 14 మంది ఉన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించవు.
పింఛన్ ఆసరా అయితున్నది..
నెల వారీగా నాకు రూ.2,016ల పింఛన్ వస్తున్నది. గీత కార్మికుల కోసం రూ.5 లక్షల బీమా కూడా తీసుకొచ్చిన్రు. మంచి మంచి పథకాలతో అందరి మనసులు గెల్చుకుంటున్నరు కేసీఆర్ సార్. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన గిసువంటి పథకాలు ఎవ్వరూ తీసుకురాలె. కేసీఆర్ చేస్తున్న సాయం ఇంతకు ముందు ఎవ్వరూ చేయలె. కేసీఆర్ సార్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– సత్తయ్య గౌడ్, మాడ్గుల