రంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో భారీ, అతి భారీ వర్షాలు, ధరణిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న 5 రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని.. ముఖ్యంగా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని, ఎకడైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే పరిషరించాలని, లేకపోతే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం లేదా నడిపించడం చేయాలని సూచించారు.
జిల్లా స్థాయిల్లో 23, 24 తేదీల్లో వర్క్‌షాప్
ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులతో తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టంపై ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లా స్థాయిలో వర్ షాప్ నిర్వహించి మేధావులు, సీనియర్ సిటిజన్ల అభిప్రాయాలను తీసుకొని రాష్ట్ర స్థాయికి పంపించాలని మంత్రి పొంగులేటి కోరారు. ధరణి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిషరించాలని, జిల్లా కలెక్టర్లు పెండింగ్‌లో ఉన్న అన్ని ధరణి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని, గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అలాంటి వాటిని గుర్తించి అప్లోడ్ చేయించాలని మంత్రి పేర్కొన్నారు.
హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసేందుకు ఆసారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సాగునీటి ట్యాంకులు, చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు, కల్వర్టులు పొంగి ప్రవహిస్తున్న చోట ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించాలని ఆమె తెలిపారు.
నష్టం జరుగకుండా చర్యలు
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఎకడ చిన్న సమస్య వచ్చినా పరిషరించేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్‌రెడ్డి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, సంబంధిత అధికారులున్నారు.
అభిప్రాయాలను సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేయబోయే రెవెన్యూ యాక్ట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో 23 (లేదా) 24 తేదీల్లో జిల్లాస్థాయిలో మేధావులు, సీనియర్ సిటిజన్స్, సీనియర్ అధికారులతో కన్సల్టేషన్ వర్క్ షాప్‌ను నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించాలని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్, ధరణి దరఖాస్తులు అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. ప్రత్యేక బృందాలను నియమించి రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సంబంధిత సిబ్బంది ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి, సరైన వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని మంత్రి కోరారు.
అధికారులకు దిశానిర్దేశం
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగకుండా అధికార యంత్రాంగమంతా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్పై ఆర్ఐలు, ఎంపీవోలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ నెల 23న మేధావులు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, సీనియర్ అధికారులతో రెవెన్యూ యాక్ట్‌పై కన్సల్టేషన్ వర్క్ షాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ధరణి దరఖాస్తుల్లో వివిధ మాడ్యూల్స్(డేటా కరెక్షన్స్, సక్సెషన్, మ్యుటేషన్, టీఎం 33)లలో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) సుధీర్, (రెవెన్యూ) లింగ్యానాయక్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు వాసుచంద్ర, శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ సంజీవరెడ్డి, ఇరిగేషన్ ఈఈ సుందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.