ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20: ఇబ్రహీంపట్నం (Ibrahimpatam) ఏరియా దవాఖాన రెండేండ్ల క్రితం వరకు డీఎంఎచ్ఓ ఆధీనంలో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రోగులకు మెరుగైన సేవలందించాలన్న సంకల్పంతో వైద్య విదాన పరిషత్ పరిధిలోకి తీసుకువచ్చింది. 30 పడకల దవాఖాన స్థాయి పెంచి రోగులకు మెరుగైన సేవలందించటం కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రామోజీఫిలింసిటి యాజమాన్యం సహకారంతో ప్రత్యేక భవన నిర్మాణానికి భూమిపూజ కూడా చేయించారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ హాస్పిటల్ బాగోగులు పట్టించుకునేవారే కరువయ్యారు. ఉన్నతాధికారులు చొరువ చూపకపోవటంతో వైద్యసేవలు కూడా కుంటుపడ్డాయి. ప్రతిరోజు రోగులు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ అందుబాటులో వైద్యులు, వైద్యసిబ్బంది లేకపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో వైద్యసేవలందించాలని స్థానికులు కోరుతున్నారు.
నగరంలోని పలు దవాఖానాలకు రెఫర్..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో సీఎచ్సీలో డీఎంఎచ్ఓ నుంచి ముగ్గురు వైద్యులు, 8మంది నర్సింగ్ సిబ్బంది, వైద్య విధాన పరిషత్ నుంచి ఐదుగురు వైద్యులు, ఇద్దరు నర్సింగ్ సిబ్బంది, 11మంది నాలుగో తరగతి సిబ్బంది పనిచేస్తున్నారు. అప్పట్లో సాయంత్రం వేళలో రోజుకో వైద్యులు అందుబాటులో ఉండేవారు. కాని, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాయంత్రం 4 గంటలు తాటితే అత్యవసర కేసులు వస్తే.. ఫోన్‌చేసి వైద్యులను పిలిపించుకోవల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర కేసులకు ప్రథమ చికిత్స చేయించి, నగరంలోని హాస్పిటల్‌కు రెఫర్ చేస్తున్నారు. వాంతులు, విరుచనాలే తప్పా అడ్మిట్ కేసులుండవు, మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు ఎప్పటికి తీరవు. ఈ దవాఖానకు ఎవరు ఎప్పుడువస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొందని, ఎవరికింద పనిచేస్తున్నామో తమకే తెలియడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆదేశాలు శూన్యం..
గతనెల 4న ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ అజయ్‌కుమార్ సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. దవాఖానలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషిచేస్తామని, వెంటనే కావల్సిన పరికరాలు, వైద్య సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక ఇవ్వాలని కోరగా.. నివేదిక పంపినప్పటికీ ఎలాంటి మార్పు లేదని సిబ్బంది, రోగులు వాపోతున్నారు.
నూతన భవన నిర్మాణం శంకుస్థాపనకే పరిమితం..
ఇబ్రహీంపట్నం హాస్పిటల్ ఆవరణలో నూతన భవన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రామోజీ ఫిలింసిటీ యాజమాన్యాన్ని ఒప్పించి దవాఖాన భవన నిర్మాణానికి నిధులు విడుదల చేయించారు. దీంతో అప్పటి మంత్రి కేటీఆర్ 2022లో శంకుస్థాపన చేశారు. కానీ ఎలాంటి పురోగతి లేక వందపడకల ఆస్పత్రిగా మారుస్తామన్న మాట.. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మాటగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే భవన నిర్మాణానికి కృషిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
సాయంత్రం 4 గంటలు దాటితే అందుబాటులో ఉండని వైద్యులు: మడుపు శివసాయి
ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రిలో గతంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేవారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఈ ఆస్పత్రికి రావాలంటేనే రోగులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4గంటలు దాటిందంటే ఎమర్జెన్సీ కేసులు ఎవరు పట్టించుకోవటంలేదు. ఈ ఆస్పత్రిలో వైద్యులకు బదులుగా నర్సులు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గర్బిణీలు, బాలింతలకు నర్సులు వైద్యసేవలు అందించటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వైద్యులు అందుబాటులో ఉండే విధంగా కృషిచేయాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే సరైన వైద్యసేవలు: డేరంగుల సత్యనారాయణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో గ్రామీణ ప్రాంతాల పేదప్రజలకు సర్కారు సరైన వైద్యం అందించింది. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆస్పత్రులకు అవసరమైన మందులు, సరైన వైద్యసిబ్బందిని కూడా నియమించటంలేదు. కాంగ్రెస్ సర్కారు హాయాంలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నమ్మి సర్కారు దవాఖానాకు పోతే వైద్యసేవలు అందించడంలో వైద్యసిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.