యాచారం, సెప్టెంబర్18: స్వచ్ఛతా హీ సేవా-2024 కార్యక్రమాన్ని మండలంలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో నరేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో అక్టోబర్ 2వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను రోజువారీగా అన్ని గ్రామాల్లో చేపట్టి పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. గ్రామ వీధులు, రోడ్లు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు, సంపులు క్రమం తప్పకుండా శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో లింగయ్య, ఏపీఎం సుదర్శన్‌రెడ్డి, ఈసీ శివశంకర్‌రెడ్డి, అధికారులు అన్నారు.
కొత్తూరు : కొత్తూరును స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శ్రీహరి అన్నారు. మున్సిపాలిటీలోని కృష్ణవేణి స్కూల్ విద్యార్థులకు స్వచ్ఛతపై బుధవారం అవగాహన కల్పించారు. దీంతోపాటు స్వచ్ఛత హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, ఆర్పీలు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కడ్తాల్ : పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందామని మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని తెలిపారు. రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదన్నారు. కాలనీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, నాయకులు నర్సింహ, శ్రీకాంత్‌గౌడ్, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కౌన్సిలర్ దేవిడి గీతావేణుగోపాల్రెడ్డి, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.