రంగారెడ్డి, మే 24(నమస్తే తెలంగాణ) : పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం కౌంటింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంక నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ చాంబర్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే కౌంటింగ్ సూపర్ వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు. జిల్లా పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు మొత్తం 777 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమిస్తూ ర్యాండమైజేషన్ జరిపారు. వీరిలో కౌంటింగ్ సూపర్ వైజర్స్ 227 మంది ఉండగా, కౌంటింగ్ అసిస్టెంట్స్ 273 మంది, మైక్రో అబ్జర్వర్లు 277 మంది ఉన్నారు.
కౌంటింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్‌తో కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులనూ అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారి సైదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.