హైడ్రాకు ఫిర్యాదు చేసినా..
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆయా కాలనీవాసులు హైడ్రాకు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఇంజాపూర్‌లో ప్రభుత్వ స్థలం కబ్జాతో పాటు రోడ్డును కబ్జాచేశారన్న ఆరోపణపై హైడ్రాకు ఫిర్యాదు చేయటంతో హైడ్రా అధికారులు రోడ్డు కబ్జా చెరనుంచి విడిపించారు. కాని, ప్రభుత్వ స్థలం కబ్జాపై దృష్టి సారించటంలేదని ఆరోపణలొస్తున్నాయి. అలాగే, కమ్మగూడలో 871గజాల స్థలం కూడా కబ్జాకు గురయ్యే అవకాశముందని, ఇప్పటికే కొంతమంది వ్యక్తులు ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నించారని, దీని కబ్జా దారుల నుంచి కాపాడాలని ఫిర్యాదు చేశారు. అలాగే, తుర్కయాంజాల్ గ్రామంలో సైతం కూడా పలు పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో భూములకు అత్యంత విలువ పెరిగిన తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీల్లో పార్కుస్థలాలు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఇండ్ల స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో గజం స్థలం రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆక్రమణ దారులు పార్కుస్థలాలు, ప్రభుత్వ భూములపై కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.
బయటి మార్కెట్లో ఈ భూముల ధర కోట్ల రూపాయలు పలుకుతున్నప్పటికీ కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదని ఆరోపణలొస్తున్నాయి. దీంతో కబ్జారాయుళ్లు రెచ్చిపోయి రాత్రికి రాత్రే పార్కు స్థలాలను ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీమిత్ర వెంచర్లో లక్ష గజాల పార్కు, ప్రజా అవసరాల భూమికి ఎన్ఓసీలు సృష్టించి అమ్మకాలు జరుపటంతో గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు దృష్టి సారించి భూమి పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే, ఆదిబట్ల మున్సిపాలిటీలో కూడా శ్రీమిత్ర వెంచర్‌లోని పార్కు స్థలాలకు డ్యాకుమెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపారు. ఈ మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో కాలనీలున్నాయి. ప్రతి కాలనీలో పార్కులు, ప్రభుత్వ స్థలాలుండగా.. వాటన్నింటికీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించారు. మిగిలిన వాటిని కూడా అమ్ముకునే ప్రయత్నాలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి పార్కు స్థలాలను కాపాడాలని కోరుతున్నారు.
ఐదుకోట్ల పార్కుస్థలానికి ఎసరు..
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ గ్రామంలో సర్వేనెంబర్ 227, 228లో అను, మను ఎంక్లేవ్ను ఏర్పాటు చేశారు. ఈ ఎంక్లేవ్‌లో పార్కుస్థలం కోసం 871గజాలను కేటాయించారు. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.5కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని కొంతమంది వ్యక్తులు గతంలో ప్లాట్లు చేసిన యజమానుల నుంచి డాక్యుమెంట్లు తయారు చేసుకుని వాటిలో నిర్మాణం చేపట్టడం కోసం మున్సిపల్ అధికారులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ భూమిపై భవన నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్కుస్థలం విషయంలో కాలనీవాసులు ఇటీవల హైడ్రా అధికారులను కూడా కలిశారు. హైడ్రా అధికారులు స్వయంగా వచ్చి పార్కుస్థలాన్ని పరిశీలించినప్పటికీ అధికారులు మాత్రం పెన్షింగ్ ఏర్పాటు చేయటంలేదు. పేరుకు మాత్రమే హెచ్చరిక బోర్డులు పాతి వదిలిపెట్టారు. కానీ, తెరవెనుక పార్కుస్థలాన్ని మాయం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్కుస్థలానికి పక్కనే ఉన్న మరో ప్లాటుకు సంబంధించిన నెంబర్‌కు /నెంబర్ వేసి డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఆరోపణలొస్తున్నాయి.
మున్సిపాలిటీలో 300కాలనీలు..
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 300 వరకు కాలనీలున్నాయి. ఈ కాలనీలన్నింటిలోనూ పార్కుల కోసం ప్రభుత్వ అవసరాల కోసం స్థలాలను వదిలిపెట్టారు. ఈ భూములను కాజేయాలని కొంతమంది లేఅవుట్లు చేసిన యజమానులతో కుమ్మక్కై బై నంబర్లు వేసి డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు, తొర్రూరు, కమ్మగూడ, ఇంజాపూర్, తుర్కయంజాల్, రాగన్నగూడ, ఎంఎంకుంటలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాగే, ఇటీవల తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని సైబర్సిటిలో కూడా పార్కుస్థలం కబ్జాచేయటంతో కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.