Elevated Corridor | సిటీబ్యూరో, మే 3(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్‌ను పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. శంకుస్థాపన తర్వాత కొంత కాలంగా ఈ ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేకుండా పోయింది. కనీసం భూసేకరణలోనూ ఎలాంటి ప్రక్రియ లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భవిత్యం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఇరుకైన ప్రాంతాలను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించింది. రెండు మార్గాల్లో ఉండే ఇరుకైన ప్రాంతాలను వెడల్పు చేసేందుకు ప్రణాళికలను రూపొందించనున్నారు.
ఈ బాధ్యతలను ఇంజనీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించనుండగా, టెండర్లు మొదలుపెట్టింది. నార్త్ సిటీకి మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేలా రూపొందించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో మరో అడుగు పడింది. ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాకున్నా… ఈ మార్గంలో రోడ్లను విస్తరించనున్నారు. దీనికోసం జాతీయ రహదారి – 44, రాష్ట్ర రహదారి -1లోని రాజీవ్ రహదారి వెంబడి ఈ పనులు చేపట్టనున్నారు. మొత్తం 16 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా… తాజాగా ఆయా మార్గాల్లో రోడ్లను ప్రాజెక్టుకు అనుగుణంగా ముందుగా వెడల్పు చేయనున్నారు. దీంతో ప్రాజెక్టు పనులు మొదలు కానున్నాయి.
కీలకంగా మారిన భూసేకరణ..
రెండు మార్గాల్లో భూసేకరణ ప్రక్రియ కీలకంగా మారింది. ఇప్పటికీ ఇరు మార్గాల్లో భూములు ఇచ్చేందుకు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సామరస్యపూరకంగా భూములు సేకరించేందుకు నిత్యం గ్రామ సభలు నిర్వహిస్తూనే ఉంది. కానీ భూములు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా ప్రాజెక్టు వలన కలిగే నష్టంపై కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా రక్షణ శాఖ కూడా భూముల బదలాయింపు కోసం మెలికలు పెడుతూనే ఉంది. పరిహారంతోపాటు, ఆయా మార్గాల్లో కూలిపోనున్న నిర్మాణాలను కట్టించి ఇస్తేనే ప్రాజెక్టు కోసం భూములు ఇస్తామని షరతులు విధించడంతో ఈ ప్రక్రియలో అనుకున్నంత వేగంగా జరగడం లేదు. కానీ హెచ్ఎండీఏ తాజాగా ఆ రెండు మార్గాల్లో ఇరుకైన ప్రాంతాలను గుర్తించి, విస్తరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.