రంగారెడ్డి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : కలెక్టరేట్లో త్వరలోనే ఈ-ఆఫీస్ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న సేవలు..ఇకపై ఆన్లైన్ ద్వారా సాగనున్నాయి. పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్ శశాంక వీలైనంత త్వరగా ఈ-ఆఫీస్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లతోపాటు అన్ని రకాల కార్యకలాపాలు ఇకపై ఆన్లైన్ ద్వారానే జరుగనున్నాయి. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి సాంకేతిక నైపుణ్యంపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు.
సరికొత్త పాలన ..
ప్రస్తుతం కలెక్టరేట్లో దరఖాస్తులు, రికార్డులు, ఫైలింగ్ అంతా కాగితాల్లోనే జరుగుతున్నది. అయితే కాలానుగుణంగా పాలనలోనూ మార్పు అనివార్యం కావడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ నేపథ్యంలోనే నూతన విధానాలతో పాలనను సరికొత్త పుంతలు తొక్కించేందుకు ఈ-ఆఫీసు విధానాన్ని అమల్లోకి తేవాలని కలెక్టర్ సంకల్పించారు.
కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు ఈ విధానాన్ని పాటించేలా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన శాఖలు బల్క్ ఈ-మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందికి సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్ఐసీ సెంటర్ నుంచి శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే జిల్లా అధికారులంతా అన్ని ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ-ఆఫీస్‌లో సేవలు ఇలా..
ఈ-ఆఫీస్ విధానంలో ఏదైనా ఒక దస్త్రం ఇన్ వార్డులోకి రాగానే.. సంబంధిత ఉద్యోగి దానిని స్కాన్ చేసి ఓ నంబర్ కేటాయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ఆ దస్త్రం దశల వారీగా పై సెక్షన్లు, చివరకు కార్యాలయ సూపరింటెండెంట్‌కు చేరుతుంది.
ఆ అధికారి లాగిన్ అయి ఆ ఫైల్‌ను సంబంధిత అధికారికి పంపిస్తారు. సంబంధిత శాఖ అధికారి ఆ దస్ర్తాన్ని పరిశీలించి డిజిటల్ సంతకం చేసి తిరిగి సూపరింటెండెంట్‌కు పంపుతారు. సూపరింటెండెంట్ నుంచి సెక్షన్ అధికారికి, అక్కడి నుంచి ఇన్చార్జికి తర్వాత దరఖాస్తుదారుడికి చేరుతుంది. ఇన్వార్డ్ నుంచి అధికారి వరకు యూజర్‌ఐడీ, పాస్వర్డ్, డిజిటల్ సంతకం కేటాయిస్తారు. తద్వారా ఇన్‌వార్డు నుంచి మొదలుకుని జిల్లా అధికారి వరకు ఈ-ఫైల్‌ను ఎక్కడి నుంచైనా పరిశీలించే అవకాశం ఉంటుంది.
పారదర్శకత.. జవాబుదారీతనం..
ఈ-ఆఫీస్ విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది. కార్యాలయాల్లో దస్త్రం వివ రాలను దరఖాస్తుదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు అంటే గదుల నిండా బీరువాలు, వాటి నిండా దస్ర్తాలు దర్శనమిస్తాయి. కొంతకాలానికి దస్ర్తాలు శిథిలమై పాత రికార్డులను తీసుకునేందుకు అవకాశం ఉండదు.
ఈ-ఆఫీసు ద్వారా రికార్డులు భద్రంగా ఉంటాయి. వచ్చిన దస్త్రం ఎక్కడుందో ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. రికార్డులను మార్చడం, తారుమారు చేయడం వంటి వాటికి కూడా చెక్‌పడుతుంది. సమయం ఆదా కావడంతోపాటు పనులు త్వరగా అవుతాయి. కొద్ది రోజుల్లోనే కలెక్టరేట్లోని అన్ని శాఖల్లోనూ ఈ తరహా సేవలు అందుబాటులోకి రానుండగా..ఇక్కడ విజయవంతం అయ్యాక మండలాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల జిల్లావ్యాప్తంగానూ ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.