వికారాబాద్, డిసెంబర్ 23: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 38 బడుల్లో పనులను జనవరి 5లోగా పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ నిఖిలతో కలిసి ఇంజినీరింగ్ విభాగాల ఏఈ, డీఈ, ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతగా 371 పాఠశాలలను ఎంపిక చేయగా.. వాటిలో పలు బడుల్లో పనులు వివిధ దశ ల్లో కొనసాగుతున్నాయని వివరించారు. పైలట్ ప్రా జెక్టు కింద ఎంపికైన 38 బడుల్లో పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఏఈ, డీఈ, ఎంఈవోలు పాఠశాలల్లో 12 రకాల పనులను పక్కగా చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వికారాబాద్, నవాబుపేట, పెద్దేముల్, కోట్‌పల్లి, మో మిన్పేట, తాండూరు మండలాల్లోని వివిధ పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు.పలు పాఠశాలల్లో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బాగా చదువుతున్నారని అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఈవో రేణుకాదేవి, ఆర్అండ్బీ ఈఈ లాల్‌సింగ్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఈ, వివిధ ఇంజినీరింగ్ విభాగాల ఏఈలు, డీఈలు, ఎంఈవోలు పాల్గొన్నారు.