రంగారెడ్డి, మే 19 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలకు పైనే అయ్యింది. రాజకీయ హ డావుడి తప్పితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వకపోగా..కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా జిల్లాలోని పంచాయతీల్లో పాలన పడకేసింది. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు..ట్రాక్టర్లకు ఈఎంఐలు చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. రోజురోజుకూ పెరిగిపోతున్న సమస్యలతో పదేండ్లుగా మాయమైపోయిన కష్టాలు నేటి కాంగ్రెస్ పాలనలో మళ్లీ ప్రత్యక్షమై పల్లె ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి.
పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు విడుదల చేస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అందజేస్తున్నది. ఈ లెక్కన చిన్న పంచాయతీలకు ఏడాదికి కనీసం రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు నిధులు విడుదలవుతున్నాయి. పెద్ద పంచాయతీలకు రూ.40 లక్షల వరకు అందుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బాగానే ఉన్నా..ఆ తర్వాత ఈ ఐదు నెలల కాలంలోనే పంచాయతీలు నిధుల కటకటను ఎ దుర్కొంటున్నాయి. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులకు సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే గ్రామ సభలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలోని 559 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.115 కోట్లకు సంబంధించి ప్రణాళికలు తయారు చేసి ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేశారు. కేంద్రం నుంచి నిధులు గత రెండేండ్లుగా అంతంతమాత్రంగానే అందుతుండగా..ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల కాలేదు. దీంతో పంచాయతీల్లో ప్రగతి కుంటుపడుతున్నది.
ట్రాక్టర్ల కిస్తీలకూ డబ్బుల్లేవ్..
జిల్లాలో 2019-20 సంవత్సర మధ్యకాలంలో పంచాయతీలు ట్రాక్టర్లను కొనుగోలు చేశాయి. పెద్ద పంచాయతీలు నగదు చెల్లించి కొనగా.. చిన్నపంచాయతీలు కిస్తీల రూపంలో కొనుగోలు చేశాయి. జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల్లో గిరిజన తండాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే చిన్న, చిన్న పంచాయతీలకు ట్రాక్టర్ల ఈఎంఐలను కట్టడం భారంగా మారింది. నెలవారీ ఇన్స్టాల్మెంట్ మిని మమ్ రూ.11వేల నుంచి రూ.15వేల వరకు చెల్లించాల్సి వస్తున్నది. వీటికితోడు డీ జిల్, మైనర్ మరమ్మతుల ఖర్చులు అదనం. కొన్ని గ్రామపంచాయతీల పాలకవర్గాలు ట్రాలీ, ట్యాంకర్లనూ రుణంపైనే తీసుకున్నాయి. చిన్న పంచాయతీల్లో పన్నులు ఎక్కువగా వసూలు కాకపోవడంతో ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులే వాటికి ఆధారం. ఖాళీ ఖజానాతో మెయింటెనెన్స్ చేయలేక హరితహారం మొక్కలకు నీటిని పట్టడం.. చెత్తను సేకరించడం వంటి కార్యక్రమాలను పంచాయతీలు సమర్థవంతంగా చేపట్టలేకపోతున్నాయి.
నీరుగారుతున్న హరితహార లక్ష్యం..
నిధుల లేమీ కారణంగా పంచాయతీల్లో హరితహార లక్ష్యం కూడా నీరుగారుతు న్నది. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ప్రతియేటా 70-80 లక్షల వరకు మొక్కలను నాటించింది. ఈ లెక్కన గత తొమ్మి దేండ్ల కాలంలో జిల్లాలో 8.27 కోట్ల మొక్కలను నాటగా పల్లెల్లో పచ్చదనం వెల్లి విరుస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత తగ్గించి 2024 సంవత్సరంలో లక్ష్యాన్ని 25 లక్షలకు కుదించింది. నిధుల లేమీ.. ఎండల తీవ్రత.. భూగర్భజలాల కొరత వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నర్సరీల్లో అంతంతమాత్రంగానే మొక్కల పెంపకాన్ని చేపట్టారు. అక్కడక్కడా మొక్కలు సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్త వాటిని నాటే పరిస్థితులు సైతం కనబడడం లేదు.
పడకేసిన ప్రత్యేక పాలన ..
జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన ఈ ఏడాది జనవరితో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించక ప్రత్యేకాధికారులను నియమించి ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక పాలనను కొనసాగిస్తున్నది. 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించింది. ప్రతిరోజూ పంచాయతీల్లో ట్రాక్టర్ సాయంతో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. అలాగే బ్లీచింగ్ పౌడర్, తాగునీటి సరఫరాకు సంబంధించి పైపులైన్లు, మోటర్ల మరమ్మ తులు, వీధిలైట్లకు సంబంధించిన పనులను చేపడుతున్నారు. ఇందుకు సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే.. లేదంటే డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పి పనులు చేయించాల్సి వస్తున్నది. పన్నుల రూపేణా వచ్చే ఆదాయం విద్యుత్తు బిల్లులకే సరిపోతుండడంతో సిబ్బందికి సైతం జీతాలు చెల్లించలేని దుస్థితి పంచాయతీల్లో నెలకొన్నది.
హరితహారం మొక్కలను సంరక్షించాలి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. గత బీఆర్ఎస్ హయాం లో గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరిశాయి. పల్లెల్లో పారిశుధ్యం, మొక్కల పెంపకం, హరితహారం నర్సరీల నిర్వహణ తదితర వాటికి మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సక్రమంగా నిధులను విడుదల చేసి వాటి అభివృద్ధికి కృషి చేసింది. పల్లెలన్నీ పచ్చగా కళకళలాడాయి. ప్రస్తుత రేవంత్ సర్కార్ వాటిని పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. హరితహారం నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు.
– సామ మల్లారెడ్డి, రైతు, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల
పంచాయతీల్లో పాలన గాడి తప్పింది..
పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు పైసా కూడా కేటాయించకపోవడంతో ప్రత్యేక అధి కారులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. అంతేకాకుండా మౌలిక వసతులు సరిగ్గా లేక ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సమస్యలు పెండింగ్‌లో పడుతున్నాయి. వచ్చేది వర్షాకాలం.. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉన్నది. ఇకపైనా పాలకులు స్పందించి వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
– ఇమ్రాన్, చేవెళ్లటౌన్
పల్లెల్లో ఎక్కడి చెత్త అక్కడే
బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడేవి. గతంలో క్రమం తప్పకుండా పారిశుధ్య సిబ్బంది ఇంటింటి నుంచి చెత్తను సేకరించి కంపోస్ట్ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేవారు. ప్రస్తుతం పల్లెలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పారిశుధ్యం లోపిస్తున్నది. మురుగు కాల్వలపై ఉన్న మ్యాన్‌హోల్ మూతలు పగిలి ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళల్లో వీధిలైట్లు వెలుగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించాలి. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి.
– రమేశ్, నందిగామ