రంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : పల్లె పోరు ముగిసింది.. రేపటినుంచి కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. నూతన సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానున్నది. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు. పాలన అనుభవం, రాజకీయ నేపథ్యంలేని వారే ఎక్కువ. మరోవైపు ఎన్నికల ప్రచారంలో గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అనేక హామీలిచ్చారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా ఎక్కడి సమస్య లు అక్కడే పేరుకుపోయాయి. వారు ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకునేలా పాలన చేస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారిం ది. ఈ క్రమంలో వారికి పల్లెపాలన సవాల్‌గా మారనున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి నిధులను విడుదల చేస్తాయి. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా.. రాష్ట్రం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రామాల్లోని జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయిస్తాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గత రెండేండ్లుగా ఈ నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామపంచాయతీల ఖజానాలు నిండుకుంటున్నాయి. నయాపైసా లేకపోవటంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని దుస్థితి నెలకొన్నది. అత్యవసర పనులను పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి చేపట్టారు. దీంతో గ్రామాల్లో నిలిచిపోయిన పనులతోపాటు పేరుకుపోయిన బిల్లులు, ఇతర పనులు నూతనం గా గెలుపొందిన సర్పంచ్‌లకు సవాల్‌గా మారనున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తైనా నేటికీ గ్రామీణ ప్రాంతాలకు రూపాయీ విదల్చలేదు. సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్న సర్పంచ్‌లకు ఇది పెద్ద సవాలే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండేండ్లు పూర్తైనా గ్రామాల్లో ఒక తట్ట మట్టికూడా తీయలేదు. ఎక్కడ అభివృద్ధి పనులూ చేపట్టలేదు. గ్రామాలకు రావల్సిన నిధులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మౌలిక సదుపాయాలు కల్పించారు. పంచాయతీ కార్యదర్శులు పెట్టిన ఖర్చును ఇప్పటికీ సర్కార్ వారిని చెల్లించలేదు.
జిల్లాలోని 526 గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలకనున్నాయి. రెండేండ్లుగా కేంద్ర, రాష్ర్టాల నుం చి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పారిశు ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. ట్రాక్టర్లకు కిస్తీలను రెండేండ్లగా కట్టడంలేదు. కరెంట్ బిల్లు లూ పెనుభారంగా మారాయి. నీటి సరఫరాకు సంబంధించి మోటర్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లులూ పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రధాన డ్రైనేజీలనూ శుభ్రం చేయలేని దుస్థితి. వీటిని పరిష్కరించడం కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారనున్న ది. అలాగే, ఎన్నికల సందర్భంగా ఆలయాలు, లైబ్రరీలు, కమ్యూనిటీహాళ్లు నిర్మిస్తామని, పంట చేలకు రోడ్లు వేయిస్తామని, గ్రామాల్లో అన్ని చోట్ల సీసీ రోడ్లతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామని హామీలిచ్చారు. నిధుల కొరతతో చిన్నపాటి సమస్యలే పరిష్కరించలేని పరిస్థితి ఉండగా హామీల అమలు వా రికి కత్తిమీద సాముగానే మారనున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.