Doma | దోమ, మే 12 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను పెంచి ఆహ్లాదాన్ని పంచగా.. నేటి కాంగ్రెస్ పాలనలో పల్లె ప్రకృతి వనాల నిర్వహణను గాలికొదిలేయడంతో ప్రకృతి వనాలు కనుమరుగవుతున్నాయనే దానికి నిలువెత్తు నిదర్శనం దోమ మండల పరిదిలోని పలుగుతాండ గ్రామ పంచాయితీలో గోచరిస్తున్నది.
పలుగుతాండ గ్రామ పంచాయితీలోని పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలకు సరైన సమయంలో నీటిని అందించకపోవడంతో అవి ఎండిపోయాయి. దానికి తోడుగా గుర్తు తెలియని వ్యక్తులు గడిసింగాపూర్ రంగారెడ్డిపల్లిని కలిపే ప్రధాన రోడ్డు పక్కన ఫారెస్టుకు ఆనుకొని ఉన్న పొదలకు నిప్పంటించడంతో ఎండిపోయి ఉన్న పల్లె ప్రకృతి వనంలోని చెట్లకు మంటలు వ్యాపించి చాలా వరకు కాలిపోయాయి. పల్లె ప్రకృతి వనంకు నిప్పంటుకొని కాలిపోయిన గాని సంబందిత అధికారులు ఏనాడు పట్టించుకోలేదని పలుగుతాండ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పల్లె ప్రకృతి వనాలకు పూర్వ వైభవం తెచ్చే విధంగా కృషి చేయాలని తండా వాసులు కోరుతున్నారు.