కులకచర్ల, మార్చి 31 : రైతులకు అన్ని రకాల రుణాలు అందించి వారికి పీఏసీఎస్ ద్వారా చేయూతనందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులకచర్ల పీఏసీఎస్ ద్వారా మూడేండ్లలో రూ.12.50 కోట్ల నుంచి రూ.47.33 కోట్ల వరకు రైతులకు వివిధ రకాల రుణాలు ఇచ్చామన్నారు. రెండేండ్లలో రూ.47.33 కోట్ల టర్నోవర్ చేసినట్లు తెలిపారు. ఈ టర్నోవర్‌ను రూ.100 కోట్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో పీఏసీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడే వారని నేడు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఇందుకు ప్రధాన కారణం పీఏసీఎస్‌పై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. పీఏసీఎస్‌లో ఆన్లైన్ ద్వారా సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్‌ను కలిసి..
గతంలో 30 నుంచి 40 ఏండ్ల వరకు పనిచేస్తూ తక్కువ జీతాలకు పని చేస్తున్నారని భావించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి సిబ్బందిని సొసైటీలో రెగ్యులరైజ్ చేయించామని డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అన్నారు. వారు ఏప్రిల్ నుంచి కొత్త జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. డీసీసీబీలో రూ.800 కోట్లు ఉంటే రూ.1600 కోట్లకు పెంచామన్నారు. ప్రతి పీఏసీఎస్‌లో గోదాముల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కులకచర్ల మండల కేంద్రంలో సుమారు రెండు కోట్ల విలువ చేసే వెయ్యి గజాల భూమిని నూతన పీఏసీఎస్ సొసైటీకి కేటాయించి భవన నిర్మాణ పనులు చేపట్టామన్నారు. పీఏసీఎస్ ద్వారా రూ.65 కోట్ల వరకు రుణాల టర్నోవర్ వెళ్లిందని, దాన్ని త్వరలో రూ.100కోట్లకు తీసుకెళ్తామన్నారు.
ఎక్కువగా పౌల్ట్రీ రుణాలు
కులకచర్ల మండలంలో ఎక్కువగా పౌల్ట్రీ రుణాలు అందిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అన్నారు. కమర్షియల్ బ్యాంకుల్లో ఎకరాకు రూ.లక్ష రుణం మాత్రమే ఇసున్నారని, సొసైటీ ద్వారా రూ.3లక్షల వరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కులకచర్లలో నూతన పీఏసీఎస్ భవనం నిర్మించడంతో పాటు తిర్మలాపూర్ గేటు దగ్గర గోదాము, రైస్‌మిల్ నిర్మించడంతో రైతులకు రానున్న రోజుల్లో ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. కులకచర్ల సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులకు అన్ని విధాలుగాఉపయోగించుకునేందుకు పీఏసీఎస్ ద్వారా ఫంక్షన్ హాల్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రెండు నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. కులకచర్ల పీఏసీఎస్‌లో 5వేల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు. మరో 14వేల మంది రైతులకు సభ్యత్వం ఉన్నా వారికి అర్హత లేదని, వారిని అర్హులుగా చేయాలని సాల్వీడ్ డైరెక్టర్ కొండయ్య కోరగా.. ఇందుకు కమిటీని వేసి చర్యలు తీసుకుంటామన్నారు.
పాల ఉత్పత్తిని పెంచేందుకు..
కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు కులకచర్ల మండల కేంద్రంలో చిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. స్పందించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి త్వరలో రైతులకు డైరీ రుణాలు అందించడంతో పాటు చిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న సభ్యులు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి చేయూతనందించాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, సీఈవో బక్కారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఎంపీటీసీ రాంలాల్, నాయకులు మొగులయ్య, రాజప్ప, కృష్ణయ్యగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు, డీసీసీబీ, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
గోడ గడియారాలు అందజేత…
కులకచర్ల, చౌడాపూర్ మండలాల సభ్యులకు పీఏసీఎస్ ద్వారా గోడ గడియారాలు అందిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి తెలిపారు. రైతులను ప్రోత్సహించేందుకు, రుణాలు తీసుకోవడంతో పాటు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సొసైటీ పరిధిలో ఉన్న సభ్యులందరికి రుణాలు, గోడగడియారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీని మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.