రంగారెడ్డి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వ నిబంధనలు.. అధికంగా పెరిగిన మెటీరియల్ ఖర్చులని స్పష్టమవుతున్నది. జిల్లాకు మొదటి విడతలో 18,000లకు పైగా ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 56 శాతం మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మరో 44 శాతం ఇంకా ప్రారంభమే కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో మండలస్థాయి అధికారులు పలుమార్లు లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రారంభమైన వాటికి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు ఒక వైపు చెబుతున్నా.. బిల్లులు సకాలంలో రావడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు మొయినాబాద్, నార్సింగి, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో అతి తక్కువగా గ్రౌండింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇసుక అందక బయటి మార్కెట్లో కొం టున్నామని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
Rr4
‘గజాల’ నిబంధనతో ఇక్కట్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారులు విధించిన నిబంధనలతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. ఇండ్ల నిర్మాణం 40 గజాలకు తగ్గకుండా 60 గజాలకు పెరగకుండా నిర్మించాలని.. 60 గజాలకు అంగుళం పెరిగినా సాయం అందించకూడదని ఆదేశాలుండడంతో 60 గజాల్లో ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులు మొగ్గు చూపడంలేదు. ప్రభుత్వం ఇచ్చే సాయంతోపాటు తాము కూడా కొన్ని డబ్బులు వేసుకుని ఇండ్లను నిర్మించుకోవాలని లబ్ధిదారులు ముందుగా ఉత్సాహం చూపారు. కానీ, 60 గజాల్లోనే ఇండ్లను నిర్మించుకోవాలని నిబంధన పెట్టడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.
పెరిగిన మెటీరియల్ ధరలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు సరిపోవడంలేదు. 60 గజాల్లో ఇండ్లు నిర్మించాలంటే సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా స్టీల్, సిమెంట్ ధరలు విపరీతంగా పెరగడం.. భవన నిర్మాణ మేస్త్రీలు, కూలీ డబ్బులూ పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పేదవారు ఇండ్ల నిర్మాణం చేపట్టినా ఎక్కువ శాతం మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు మరో రెండు రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించకపోతే వాటిని రద్దు చేసి.. రెండో విడతలో కొత్తవారికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.