మహేశ్వరం, అక్టోబర్ 28 : ఆశీర్వదించండి.. మహేశ్వరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాబయ్య ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మీర్‌పేటలో శుక్రవారం రాత్రి ఎన్నికల కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు.
సీఎం కేసీఆర్ జిందాబాద్, సబితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలు మార్మోగాయి. మంత్రి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మరోసారి సేవచేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని, 30 రోజులు నా కోసం పని చేస్తే శ్వాస ఉన్నంత వరకు ప్రజా సేవ చేస్తానని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సబితమ్మ వెనుక ఉన్న బలాన్ని చూసి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఢిల్లీలో చర్చలు చేస్తున్నారన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 15లక్షల మందికి దళితబంధు పథకం అందజేశామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మెట్రో రైలు పరుగులు పెడుతుందన్నారు. మెడికల్ కళాశాలలు ఏర్పాటు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ సునీతాఅంద్యానాయక్, కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, పాండు యాదవ్, కూన యాదయ్య, సుధీర్‌గౌడ్, మద్ది కర్ణాకర్‌రెడ్డి, అంజయ్య ముదిరాజ్, లచ్చనాయక్, సమీర్ వర్కాల యాదగిరి, కర్రొల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.