రంగారెడ్డి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలు పొందిన లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. జిల్లాలో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాల్లో హడావిడిగా ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలను లబ్ధిదారులకు అధికారులు అందజేశారు. అందజేసిన హామీ పత్రాలపై ముఖ్యమంత్రి, సంబంధిత రెవెన్యూ మంత్రి పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ, వారి సంతకాలు లేవు. అలాగే, సంబంధిత గృహనిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీవోల సంతకాలు లేవు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో 21 మండలాల్లో 21 గ్రామాలను గుర్తించి నాలుగు పథకాలను ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది. ఆత్మీయ భరోసా కింద కొంతమందికి ప్రొసీడింగ్లు, రైతుభరోసా కింద పెట్టుబడి సాయం చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలు, రేషన్ కార్డులను అందజేశారు. కానీ, ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రంలో ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఫొటోలతో ముద్రించిన హామీ పత్రాలు అందజేశారు. హామీ పత్రాల్లో కింద ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పేర్లు మాత్రమే ఉన్నాయి. కాని, వాటిలో సంతకాలు లేవు. ఇతర జిల్లాలో మాత్రం హామీ పత్రాల్లో ఎంపీడీవోల సంతకాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులతోపాటు గ్రామసభల్లోనూ మరో 84వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలో 3.75లక్షల దరఖాస్తులు.. ఇచ్చింది మాత్రం 1,067 మందికి ..
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 13 మున్సిపాలిటీలు, 21 మండలాలు, 2 కార్పొరేషన్లలో 3.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సొంత జాగా ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారు 74,963 మంది, సొంత జాగా లేకుండా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 1,05లక్షల మంది. చాలీచాలని సొంత ఇల్లు ఉన్న వారు 1.84లక్షల మంది ఉన్నారు. మొదటి విడుతలో జిల్లాలోని 21 గ్రామాల్లో 1,060 మందిని మాత్రమే గుర్తించి అందించిన ప్రొసీడింగ్లపై సంతకాలు లేకపోవడంతో బిల్లు వస్తుందా.. రాదా అన్న అయోమయంలో లబ్ధిదారులు ఉన్నారు. పక్కనే ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం హామీపత్రాలపై సంతకాలు లేవంటూ అధికారులు హామీ పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో కూడా ఎదురయ్యే అవకాశముందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.