దోమ, ఏప్రిల్ 8 : మండలంలోని మోత్కూర్ గ్రామంలో తిష్ట వేసిన సమస్యలపై సమస్యల వలయంలో మోత్కూరు అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డి ఐదోవార్డులో రోడ్డుపై పారుతున్న మురుగుతోపాటు రోడ్డు పక్కన డబ్బాల వెనుక ఉన్న చెత్తాచెదారాన్ని సిబ్బందితో తొలగింపజేశారు. అదేవిధంగా తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు మిషన్ భగీరథ ఈఈ చలమారెడ్డి, ఆర్డబ్ల్యూస్ ఏఈలు, వాటర్ గ్రిడ్ అధికారులు నీటి లభ్యతను పరిశీలించి గ్రామంలోని జీఎల్ ఎన్ఆర్ (పాత ట్యాంకు)కు మరమ్మతులు చేయించి నీటి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.
కులకచర్ల, ఏప్రిల్ 8 : మండలంలోని సాల్వీడ్ గ్రామంలో భూగర్భజలాలు తగ్గి బోర్లు ఎండిపోతున్నాయని కర్షకుల కన్నీటి వ్యథ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి మండల వ్యవసాయాధికారులు స్పందించారు. మంగళవారం మండల వ్యవసాయాధికారి వీరస్వామి ఆదేశాల మేరకు ఏఈవో బాబు సాల్వీడ్ గ్రామంలోని రైతులు రమేశ్, బస్వరాజ్ల వరి పంటను పరిశీలించి మాట్లాడారు. ఎండిపోయిన పంటల వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
పూడూరు, ఏప్రిల్ 8 : మండలంలోని దండుగడ్డ గ్రామంలోని రైతు వడ్ల అంజయ్య ఎకరం పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంట రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి పూర్తిగా నేలకొరిగింది. ఆరుగాలం కష్టపడగా.. 15 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో పంట మొత్తం నేల పాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పంటను ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పు తీసుకొచ్చి సాగు చేశానని.. దాదాపుగా 25 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండేదని..దానిని విక్రయించి అప్పు చెల్లించొచ్చునని భావించానని పేర్కొన్నాడు. ఆ వానతో బావిలోని కరెంట్ మోటర్ సైతం కాలిపోయి మరో రూ.4 వేల వరకు నష్టం వాటిల్లిందని.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో.. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.