KCR Nutrition kit | మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించడంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసం ప్రత్యేక న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నది. తొలి విడుతలో కేవలం తొమ్మిది జిల్లాల్లో అమలు చేయగా.. ఈ సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 60 వేల మంది గర్భిణులకు మేలు జరుగనున్నది. సుమారుగా రూ.3వేల విలువ చేసే ఈ న్యూట్రిషన్ కిట్‌లో ఒక కేజీ మదర్ హార్లిక్స్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిల్స్, 500 గ్రాముల నెయ్యితో పాటు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఈ కిట్లు వచ్చే వారంలో జిల్లాలో ఉన్న 45 ప్రభుత్వ దవాఖానలకు చేరుకోనున్నాయి. ఈ నెలాఖరు వరకు గర్భిణులందరికీ కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కడుపులోని బిడ్డ నుంచి వృద్ధుల వరకు తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాలు అందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-షాబాద్, మే 10
షాబాద్, మే 10 : గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించి మాతా, శిశు మరణాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పౌష్టికాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నది. తొలి విడుతలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అమలు చేసిన ఈ పథకాన్ని ఈ సంవత్సరం నుంచి మిగిలిన అన్ని జిల్లాలకు వర్తింప చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పౌష్టికాహారం తీసుకోలేని గర్భిణుల సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారికి పోషకాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.3వేల విలువైన న్యూట్రిషన్ కిట్‌లో కిలో మదర్ హార్లిక్స్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిల్స్, 500 గ్రాముల నెయ్యితో పాటు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 45 ప్రభుత్వ దవాఖానాలున్నాయి. అన్ని దవాఖానలకు వచ్చే వారంలో న్యూట్రిషన్ కిట్లు చేరనున్నాయి. ఈ నెలాఖారు వరకు గర్భిణులకు కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఏడాదికి సుమారు 60వేల మంది గర్భిణులకు లబ్ధి చేకూరనున్నది.
రంగారెడ్డి జిల్లాలో 45 ప్రభుత్వ దవాఖానలు..
మాతా, శిశు మరణాలను తగ్గించడంతో పాటు సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 45 ప్రభుత్వ దవాఖానలున్నాయి. ఇందులో ఒకటి కొండాపూర్ జిల్లా ప్రభుత్వ దవాఖాన, రెండు ఏరియా దవాఖానలు, ఐదు సీహెచ్‌సీలు, 37 పీహెచ్‌సీలున్నాయి. ఈ దవాఖానలన్నింటికీ వచ్చే వారంలో ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లు సరఫరా చేయనున్నది. ఆ తర్వాత ఉన్నాతాధికారుల నుంచి ఆదేశానుసారం ఈ నెలాఖారు వరకు వాటిని గర్భిణులకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు విడుతల్లో కిట్ల పంపిణీ..
న్యూట్రిషన్ కిట్లు రెండు విడుతల్లో పంపిణీ చేయనున్నారు. గర్భం దాల్చిన 14 నుంచి 24 వారాల మధ్య ఒక న్యూట్రిషన్ కిట్, తర్వాత నెల రోజులకు అంటే 24 వారాల నుంచి 32 వారాల మధ్య రెండో కిట్ అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే న్యూట్రిషన్ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్(మదర్ హార్లిక్స్) కిలో, ఖర్జూర కిలో, ఐరన్ సిరప్ బాటిల్స్-3, నెయ్యి-500 గ్రాములు, పల్లిపట్టీ-200గ్రాములు, అల్బెండజోల్ ట్యాబ్లెట్స్, తాగడానికి అవసరమైన ప్లాస్టిక్ కప్పును ఇస్తారు. న్యూట్రిషన్ కిట్స్‌ను మొదటి విడుత బుట్ట రూపంలో ఇస్తే, రెండో విడుతలో బట్ట సంచి రూపంలో ఇస్తారు.
న్యూట్రిషన్ కిట్‌తో గర్భిణులకు మేలు..
గత ఏడాది వివిధ జిల్లాలో ప్రభుత్వం మొదటి విడుతగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేసింది. ఫైలెట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారం నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. గర్భిణుల్లో రక్తహీనత నివారించడానికి న్యూట్రిషన్(పోషకాహార)కిట్లు అందిస్తున్నది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం అందిస్తున్న ఈ కిట్లతో గర్భిణులకు ఎంతో మేలు జరుగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఏడాదికి సుమారు 60వేల మంది గర్భిణులకు లబ్ధి చేకూరనున్నది.
ఈ నెలాఖారు వరకు పంపిణీ చేస్తాం..
గర్భిణుల్లో రక్తహీనతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా న్యూట్రిషన్ కిట్లను అందజేస్తుంది. వీటిని రెండు విడుతల్లో పంపిణీ చేస్తుంది. జిల్లావ్యాప్తంగా 45 ప్రభుత్వ దవాఖానల్లో ఈ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చే వారంలో అన్ని దవాఖానలకు కిట్లు చేరుకుంటాయి. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ నెలాఖారు వరకు కిట్లను పంపిణీ చేస్తాం.
– వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి