వికారాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 25 రోజులు మాత్రమే గడువు ఉండడంతో వసూలు ప్రక్రియను ముమ్మరం చేశారు. ఏటా మార్చిలోనే మెజార్టీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ నెలాఖరులోగా వందశాతం ఆస్తి పన్ను వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇప్పటివరకు 75.42 శాతం మేర ఆస్తి పన్ను వసూలుకాగా.. మిగతాది సైతం రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.9.69 కోట్లలో ఇప్పటివరకు రూ.7.31 కోట్ల ఆస్తి పన్ను వసూలుకాగా, మరో రూ.2.38 కోట్ల పన్ను రావాల్సి ఉన్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూలు చేసేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఐదారేండ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో ఏటా లక్ష్యానికి అనుగుణంగా వసూలవుతున్నది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను ప్రారంభించారు.
మరోవైపు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శి ఉండేలా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించడం కూడా ఆస్తి పన్ను వసూళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. వసూలైన రూ.7.31 కోట్లలో పన్నుల రూపంలో వచ్చినవి రూ.6.82 కోట్లు కాగా, నాన్ ట్యాక్స్ రూపంలో రూ.47.45 లక్షలు ఉన్నాయి. అన్ని మండలాల్లోనూ 60 శాతానికిపైగా వసూలుకావడం గమనార్హం. ధారూరు, కొడంగల్, వికారాబాద్ మండలాల్లో ఇప్పటివరకు అత్యధికంగా ఆస్తి పన్ను వసూలైంది.
జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాం. దాదాపు 75 శాతం మేర ఆస్తి పన్ను వసూలైంది. మరో రూ.2.38 కోట్ల ఆస్తి పన్నును ఈ నెలాఖరులోగా రాబడుతాం. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం.
-జయసుధ, డీపీవో