రంగారెడ్డి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : జిల్లా విద్యాశాఖలోకి ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాకు చెందిన టీచర్లను జూనియర్ల పేరు తో ఇతర జిల్లాలకు పంపించడం.. అదేవిధంగా జిల్లాకు కొత్తగా వివిధ మార్గాల్లో వచ్చే వారితో స్థానిక నిరుద్యోగులకూ తీరని అన్యాయం జరుగుతున్నది. జిల్లాలో ఉద్యోగాలను సంపాదించేందుకు ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలోనే పైరవీలు చేస్తున్నారు.
జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పది మండలాలు రంగారెడ్డి జిల్లాలో విలీనయమ్యా యి. దీంతో జీవో 317 ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ వంటి జిల్లాల్లో సీనియర్లుగా ఉన్న ఉపాధ్యాయులంతా సీనియారిటీ ప్రకారం జిల్లాకు పెద్ద ఎత్తున బదిలీ చేయించుకున్నారు.
మరోవైపు, భార్యాభర్తల బదిలీల పేరుతోనూ అధిక సంఖ్యలో పైరవీలు చేసుకుని జిల్లా కు వచ్చారు. దీంతో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు సుమారు వెయ్యిమంది వరకు జూనియర్ల పేరుతో వికారాబాద్ వంటి పలు జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో జిల్లాకు చెందిన ఉద్యోగులే జిల్లాలో పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించకపోతే జిల్లాకు తీరని అన్యాయం జరిగే అవకాశాలున్నాయి.
ఇతర జిల్లాల వారితో నిండిపోతున్న పోస్టులు
జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టులన్నీ ఇతర జిల్లాల వారితోనే నిండిపోతున్నాయి. జిల్లాలో ఖాళీలు ఉండడకపోవడంతో స్థానిక నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఇప్పటికే జిల్లాలో 40 నుంచి 50 శాతం మంది ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. కోటాకు మించి స్థానికేతరులైన ఉపాధ్యాయులు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరం తా జిల్లాల పునర్విభజన, భార్యాభర్తల బదిలీల ద్వారా జిల్లాలోకి వచ్చారు. దీంతో జిల్లాలో ఖాళీగా పోస్టులు లేకుండా పోతున్నాయి.
కొత్తగా భార్యాభర్తల బదిలీల పేరుతో 32 మంది ..
జిల్లాలో ఇప్పటికే కోటాకు మించి స్థానికేతరులు జిల్లాలో పని చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘా లు మొత్తుకుంటున్నా.. వాటిని లెక్కచేయకుండా ప్రభుత్వం కొత్తగా మరో 32 మంది ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులను భార్యాభర్తల బదిలీల పేరుతో జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసింది. వారిలో 12 మంది స్కూల్ అసిస్టెంట్లు కాగా, 20 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులున్నారు. వీరి రాకతో జిల్లాలో స్థానికేతరుల సంఖ్య మరింత పెరిగింది.
ఇప్పటికే జిల్లాకు వందల సంఖ్యలో వచ్చారు..
స్థానికేతరులతో జిల్లాలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్న ది. భార్యాభర్తల బదిలీల పేరిట జిల్లా కు ఇతర జిల్లాల నుంచి 32 మందిని కేటాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం దారుణం. ఇప్పటికే 317 జీవో ద్వారా వందల సంఖ్యలో ఇతర జిల్లాలకు చెందిన టీచర్లు వచ్చా రు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చుపెట్టి స్థానిక నిరుద్యోగులు డీఈడీ, బీఈడీలు చేసినా ఉద్యోగాలు రాకపోవడంతో పొట్టకూటి కోసం చిన్నచిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
-రాజిరెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి