వికారాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిల్లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటిని నిర్మించాలని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా 15 బ్రిడ్జిల వరకు మంజూరు చేయాలని గత కొన్నేండ్లుగా కేంద్రానికి విన్నవిస్తున్నా ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జికి కూడా నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం. వికారాబా ద్ పట్టణంలో తాండూరు వెళ్లే మార్గంలో, రామయ్యగూడ, గంగారం వద్ద.. తాండూరు పట్టణంలో పాత తాండూరుతోపాటు మరో రెండు చోట్ల రైల్వే బ్రిడ్జిలు తప్పనిసరి అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాటితోపాటు వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు, తరిగోపుల, మర్పల్లి, మొరంగపల్లి, గేటువనంపల్లి, తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంతోపాటు పలు చోట్ల రైల్వే బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు.
అయితే రైల్వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలన్న ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం సర్వేలు చేసి వదిలేస్తున్నదని.. వంతెనలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వికారాబాద్ సమీపంలోని కొత్తగడి వద్ద రైల్వే ట్రాక్ వద్ద గేటు లేకపోవడంతో వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వెళ్తున్న కారును రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం స్పందించిన సంబంధిత శాఖ అధికారులు రైల్వేగేట్‌ను ఏర్పా టు చేశారు. ఏదో ఒక ప్రమాదం జరిగితే గానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదని జిల్లా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని రెండుసార్లు గెలిపించినా…రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం నుంచి నయా పైసా తీసుకురాకపోవడం గమనార్హం.
కేంద్రానికి పట్టని ప్రజల కష్టాలు..
ప్రతిఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎదురుచూపులే తప్పా ఒక్క రూపాయీ కేటాయింపుల్లేవ్. ఎంఎంటీఎస్ వికారాబాద్ వరకు పొడిగింపుతోపాటు బుల్లెట్ రైలు తదితర ప్రాజెక్టులను పెండింగ్‌లోనే పెడుతూ వస్తున్న మోదీ ప్రభుత్వం.. కనీసం రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికీ నిధులివ్వడం లేదు. రైల్వే వంతెలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నా ఫలితం ఉండడంలేదు. రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అరగంట వరకు రైల్వేగేట్ల ఎదుట ఎదురుచూడాల్సి వస్తున్నది.
తాండూరు నుంచి వికారాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్‌ల్లో రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వంతెనలు లేకపోవడంతో రైల్వే గేటల వద్ద ఎదురుచూడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ధారూరు మండలంలోని తరిగోపు ల సమీపంలో ఉన్న రైల్వే లైన్‌తో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేట్ లేకపోవడంతోపాటు కిలోమీటర్ మేర తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. వర్షాకాలంలో అయితే ఆ మార్గం గుండా నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంలోనూ రైల్వే బ్రిడ్జి లేకపోవడంతో కిలోమీటర్ మేర తిరిగి బషీరాబాద్ ప్రభుత్వ కార్యాలయాలతోపాటు జీవంగి తదితర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కేసీఆర్ పాలనలో సాఫీగా ప్రయాణం..
బీఆర్ఎస్ హయాంలో ఎక్కడైతే వాగులు పొంగిపొర్లి రవాణా స్తంభిస్తుందో ఆ ప్రాంతాలను గుర్తించి వంతెనలను నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చింది. జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా నదులతోపాటు ఈసీ వాగు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వాగులు, మారుమూల పల్లెల్లోని వాగులపైనా రూ.కోట్లు ఖర్చు చేసి వంతెనలు నిర్మించడంతో ప్రజలకు కష్టాలు తప్పి రవాణా సాఫీగా సాగుతున్నది. జిల్లాలో కేసీఆర్ హయాంలో 31 వంతెనల నిర్మాణానికి రూ.142 కోట్లకుపైగా నిధులను వెచ్చించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పాలనలో మారుమూల పల్లెల్లోనూ వాగులపై వంతెనలను రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.