వికారాబాద్, మే 20 : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్‌నాయక్ తెలిపారు. సోమవారం పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులందరూ సహకరించాలన్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తారన్నారు.
మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించేందుకు వికారాబాద్ మండలంలో 6, తాండూరు 4, పరిగి 4., నవాబుపేట, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్‌పేట్, దోమ, కొడంగల్, కులకచర్ల మండలాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున మొత్తం 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆయన తెలిపారు.
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 7831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో 4621 మంది, రెండో సంవత్సరంలో 3210 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలన్నారు.
పరీక్షా సమయాల్లో నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండాలని, అత్యవసర మందులతో పాటు ఏఎన్ఎం, సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా సమయాలను బట్టి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను నడిపించాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమీక్షా సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్ బిక్షూనాయక్, పోస్టల్ అధికారి పద్మారావు, విద్యుత్ శాఖ ఏడీ రామచంద్రయ్య, ఆర్డీవో డీఏవో గోవిందమ్మ, పోలీస్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ బుచ్చయ్య, వైద్య ఆరోగ్య శాఖ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.