Vikarabad | బషీరాబాద్, జులై 10 : మండల కేంద్రంలోని పశువుల దవాఖానలో వైద్యుడు లేక పశువులకు సరైన చికిత్స అందడం లేదని మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు గడుస్తున్న పశు వైద్యుడిని ప్రభుత్వం నియమించడం లేదని అన్నదాతలు వాపోయారు. మూగజీవాలకు ఎదైనా జరగరానిది జరిగితే చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదన్నారు. పశువులను తొలుకుని దవాఖానకు పోతే అక్కడ అటెండర్ తప్ప ఎవ్వరూ ఉండరని, తప్పని పరిస్థితిల్లో అటెండర్ చేత పశువులకు చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. చికిత్స చేసేటప్పుడు పశువులకు ఎదైనా జరిగితే నష్టపోయేది రైతులమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న అటెండర్ కూడా సమయానికి రాడని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని సార్లు దవాఖానకు వచ్చి వెనుదిరిగి వెళ్లినట్లు రైతులు తెలిపారు. వర్ష కాలంలో పశువులకు రోగాలు ఎక్కువగా వస్తాయని వైద్యుడు లేకపోతే పశువులకు చికిత్స చేసేది ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో వైద్యుడు లేకపోవడంతో ప్రయివేట్ వ్యక్తులతో పశువులకు వైద్యం చేయించాల్సి వస్తుందని వారు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని వాపోయారు.
నేనే వైద్యం చేస్తున్న: అటెండర్ రవి
వైద్యుడు లేకపోవడంతో దవాఖానకు వచ్చే పశువులకు నేనే వైద్యం అందిస్తున్నా. నేను అటెండర్‌గా కాంట్రాక్టు పద్దతిలో విధులు నిర్వహిస్తున్నాను. ఆరు నెలల నుంచి పశు వైద్యుడు లేడు నాకు వచ్చిన వైద్యంతో పశువులకు చికిత్స చేస్తున్న. శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే పక్క దవాఖాన నుంచి పశు వైద్యుడు వచ్చి చేస్తాడు.