No Horn | ఉప్పల్, ఫిబ్రవరి 9 : అనవసరంగా హారన్ మోగించడం ఆపేద్దామని.. శబ్ద కాలుష్యాన్ని తగ్గిద్దామని రోడ్ సేఫ్టీ స్క్వాడ్, డ్రైవ్ సేఫ్ హైదరాబాద్ బృందం పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఉప్పల్ జంక్షన్లో నో హాంకింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను ఆదివారం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.
అనవసరంగా హారన్ మోగించడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను వివరిస్తూ వాహనదారులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఎక్కువగా హారన్ మోగించకుండా, బ్రేకులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. శబ్ద కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. హారన్ మోగించకుండా, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. హారన్ కొట్టకుండా, లైట్లను ఉపయోగించి కూడా అప్రమత్తం చేయవచ్చని చెప్పారు. అవగాహనతోనే సమస్యలను పరిష్కరించవచ్చని తెలియజేశారు .