వికారాబాద్, ఆగస్టు 23 : కల్తీ కల్లు అని నిర్ధారణ కాలేదని..ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ మండలంలోని పీరంపల్లి గ్రామానికి చెందిన కొందరు కల్లు తాగి అస్వస్థతకు గురైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.
వెంటనే సంబంధిత అధికారులను పీరంపల్లికి పంపించి వివరాలు సేకరించామని.. కల్లును పరీక్షించగా కలుషిత నీరని తెలిసిందన్నారు. అయినప్పటికీ ఒకరిపై కేసు నమోదు చేశామన్నారు. కల్లు తాగడంతోనే కొందరు అస్వస్థతకు గురైనట్లు ఆరోపణలున్నాయన్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో కలుషిత నీటితో డయేరియా, కలరా, విషజ్వరాలు వచ్చాయనే అనుమానం ఉందన్నారు. 20, 21, 22 తేదీల్లో పీరంపల్లి చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోని కల్లు దుకాణాలను సైతం పరీక్షించామ ని.. వాటి శాంపుళ్లను సేకరించి, కేసు రాసి కోర్టుకు పంపించామన్నారు. రెండు రోజుల్లో అవి ల్యాబ్‌లకు వెళ్తాయన్నారు.
వచ్చిన రిపోర్టుల ఆధారంగానే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా శాఖ తరఫున ఎలాంటి లోపాల్లేవన్నారు. కలుషిత నీరు కావొచ్చనే అనుమానం ఉందన్నారు. జిల్లాలో మొత్తం 2,246 లైసెన్స్ దుకాణా లున్నాయని, వాటిలో ప్రతినెలా శాంపుళ్లను సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రాఘవీణ, ఎస్సై పాల్గొన్నారు.
కల్తీ కల్లుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని మిషన్ దవాఖానలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తీ కల్లు బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అవినాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం పీ మాట్లాడుతూ… అది ఈత, తాటి కల్లు కాదని.. డైజోఫామ్తో తయారు చేసిన కృత్రిమ కల్లు అని పేర్కొన్నారు. కల్తీ కల్లును పూర్తిగా నిషేధించాలని..అనుమతుల్లేకుం డా కొనసాగుతున్న కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. చాలామంది కల్తీ కల్లు బారి న పడుతున్నారన్నారు. దుర్గయ్య ఎలా మృతి చెందాడనే విషయం పోస్టుమార్టం రిపోర్టు, ల్యాబ్‌లో కల్లు శాంపిళ్లు పరిశీలించిన తర్వాత తెలుస్తుందన్నారు. బాధితులకు న్యా యం చేస్తానన్నారు. ఆయన వెంట నాయకులు నందు, శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరోత్తంరెడ్డి, బస్వలింగం తదితరులు ఉన్నారు.