జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకుగాను సంబంధిత అధికారులు నడుం బిగించారు. రెండు, మూడు ఏండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని సంఘాలను గుర్తించి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 13,138 స్వయం సహాయక సంఘాలు మొండికేయడంతో రూ.18.31 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని సంబంధిత సంఘాల నుంచి వసూలు చేసేందుకు నెలవారీగా టార్గెట్‌ను నిర్దేశించుకొని డీఆర్డీవో యంత్రాంగం చర్యలు చేపట్టింది. రుణాలను తిరిగి చెల్లించని సంఘాలకు రుణాలను మంజూరు చేయవద్దని బ్యాంకు అధికారులకు డీఆర్డీఏ యంత్రాంగం సమాచారమిచ్చింది. జిల్లావ్యాప్తంగా 13,138 స్వయం సహాయక సంఘాలుండగా, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.394.27 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు.
– వికారాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
పెండింగ్‌లో రూ.18.31 కోట్ల బకాయిలు..
జిల్లావ్యాప్తంగా రూ.18.31 కోట్ల రుణాలను సంఘాల నుంచి రికవరీ చేయాల్సి ఉన్నది. రికవరీతోపాటు సంఘాలను మరింత బలోపేతం చేసేందుకూ అధికారులు చర్యలు చేపట్టారు. పనిచేయని సంఘాల్లో కదలిక తీసుకొచ్చేందుకు కొత్తగా రుణాలను మంజూరు చేయబోమని హెచ్చరిస్తూ, బకాయిల వసూలుకు యత్నిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరు…సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నారా, ఎంత మంది సభ్యులు హాజరవుతున్నారు, సంబంధిత ఎస్హెచ్జీకి ఎంత అప్పు ఉన్నది, ఎంత డబ్బు పొదుపు చేశారనే విషయాలను సేకరిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా యాలాల, పరిగి, దోమ, బంట్వారం, కోట్‌పల్లి, తాండూరు మండలాల్లో మొండికేసిన సంఘాలు అధికంగా ఉన్నాయి.
యాలాల మండలంలో 166 సంఘాల నుంచి రూ.2.66 కోట్లు, పరిగి మండలంలో 110 సంఘాల నుంచి రూ.2.55 కోట్లు, దోమ మండలంలో 106 సంఘాల నుంచి రూ.1.70 కోట్లు, బంట్వారం మండలంలో 64 సంఘాల నుంచి రూ.1.56 కోట్లు, కోట్‌పల్లి మండలంలో 99 సంఘాల నుంచి రూ.1.56 కోట్లు, తాండూరు మండలంలో 127 సంఘాల నుంచి రూ.1.37 కోట్లు, మోమిన్‌పేట మండలంలో 75 సంఘాల నుంచి రూ.1.36 కోట్లు, పెద్దేముల్ మండలంలో 93 సంఘాల నుంచి రూ.92.67 లక్షలు, మర్పల్లి మండలంలో 74 సంఘాలు, ధారూరు మండలంలో 63 సంఘాలు రుణాల బకాయి ఉన్నాయి. బొంరాస్‌పేట మండలంలో 51 సంఘాల నుంచి రూ.37.64 లక్షలు, పూడూరు మండలంలో 60 సంఘాల నుంచి రూ.56.06 లక్షలు, వికారాబాద్ మండలంలో 37 సంఘాల నుంచి రూ.19.89 లక్షలు. కొడంగల్ మండలంలో 58 సంఘాల నుంచి రూ.35.01 లక్షల బకాయిలను వసూలు చేయాల్సి ఉన్నది.