సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరులు గూండాగిరి చేస్తున్నారు. పోలీసుల ముందే కాంగ్రెస్ నా యకులు రౌడీయిజం చేస్తున్నారు. శుక్రవారం బోరబండ లేబర్ అడ్డా వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తుండగా నవీన్‌యాదవ్ అనుచరులు అడ్డుకున్నారు. తమ ఏరియాలో మీ రెట్లా ప్రచారం చేస్తారంటూ బెదిరింపులకు దిగారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కాం గ్రెస్ అభ్యర్థి కుటుంబానికి రౌడీముద్ర ఉండడంతో అతడి అనుచరులు గూండాగిరి చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీల్లో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారానికి ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బోరబండలో జరిగిన గొడవ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా కనీసం, ప్రచారాన్ని అడ్డుకున్న వారిని నిలువరించకపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనమంటూ ప్రజలు చెబుతున్నారు.