మైలార్‌దేవ్‌పల్లి, మే 9: కార్మికులంతా తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని ఐఎన్టీయూసీ (INTUC) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనుంజయ్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. కాటేదాన్‌లోని సీఐటీయూ కార్యాలయంలో ఈ నెల 20న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను (General Strike) విజయవంతం చేయాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల పిలుపు మేరకు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందన్నారు. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 ఏండ్లలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు.
2025–26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే ఆర్థిక విధానాలను విచక్షణారహితంగా అమలు చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెక్కి కోట్టేందుకు, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు ఈ నెల 20న దేశవ్యాప్తం సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జాజాల రుద్రకుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జీఎం కురుమయ్య, ఎన్.జంగయ్య, శంకర్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.