వికారాబాద్, జనవరి 26 : జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు సహకరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా నిలుపుకొనేందుకు అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చుకున్నామన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులు, రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిపుణులకు కలెక్టర్ జోహార్లు అర్పించారు.
రేవంత్ ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో ముందున్నదని.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా అమలు చేస్తున్నదన్నారు. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతుభరోసా వంటి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. 1 మార్చి 2024 నుంచి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లుల జారీ ప్రారంభం అయ్యిందని, జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు 1,36,000 మంది వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.30.06 కోట్లను చెల్లించిందన్నారు. మహాలక్ష్మి పథ కం కింద జిల్లాలో 1,17,000 మంది లబ్ధిదారులకు 2,82,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశామని.. ఇందుకు ప్రభుత్వం రూ.7.36 కోట్ల గ్యాస్ సబ్సిడీ భరించిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇప్పటివరకు మహిళలు, ట్రాన్స్జెండర్లు 2.70 కోట్ల మంది వినియోగించుకున్నారన్నారు. జిల్లాలో రుణమాఫీ పథకం కింద లక్షా 358 మంది రైతన్నలకు రూ. 849.30 కోట్ల రుణాలను చెల్లించామని, రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు జిల్లాలో 126 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసి ఖరీఫ్‌లో 51,784 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ. 120 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రూ. ఐదు నుంచి రూ.
పది లక్షలకు పెంచామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా జిల్లాలోని 1,062 పాఠశాలల్లో 924 బడుల్లో అన్ని రకాల పనులను పూర్తి చేయించామని, ఇందుకు రూ.17 కోట్ల 55 లక్షలు వెచ్చించామని ఆయన వివరించారు. ఈ గణతంత్ర దినోత్సవ రోజున రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల కోసం ‘మూవీ క్లబ్’ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 670 అంగన్వాడీ కేంద్రాల్లో రూ.కోటీ31 లక్షలతో మరమ్మతులు చేయించామని, ఉపాధి హామీ పనుల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నదని.. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.43 కోట్ల 92 లక్షల రుణాలు, 4,555 పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పటివరకు రూ. 404 కోట్ల 83 లక్షల రుణాలను ఇచ్చామన్నారు. గణతంత్ర వేడుకల్లో కొత్తగడి బాలికల గురుకుల పాఠశాల, కస్తూర్బాగాంధీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మోమిన్‌పేట, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాల బండివెనుకచర్ల, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సంఘం లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శం కర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.