నందిగామ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ పాత జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొద్ద యాదయ్య(34) కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప టెంపుల్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ పంపులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం యాదయ్య డ్యూటికి వెళ్లి శనివారం ఉదయం 7 గంటలకు తన ద్విచక్ర వాహనంపై నందిగామలోని హనుమన్ దేవాలయానికి వెళుతుండగా నందిగామ పాత జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నందిగామ సీఐ రామయ్య తెలిపారు.