“ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నా.. బీఆర్ఎస్ పార్టీ క్యాడరే నా బలం.. ప్రజలే నా బలగం.. సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేండ్లుగా చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు.. మూడోసారి కూడా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు..” అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సీటును మరోసారి ఆమెకు కేటాయించిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, వెచ్చించిన నిధులు, రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరుపై వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని సీట్లు గెలిచి తీరుతాం. ప్రజా సంక్షేమం, ప్రగతినే ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతాం. సీఎం కేసీఆర్ మరోసారి టికెట్ కేటాయించాక ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది. పారిశ్రామిక ప్రగతిలో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. రూ.2వేల కోట్లకు పైగా నిధులతో మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. మౌలిక వసతులు పల్లెలు, పట్టణాల ముఖచిత్రమే మారిపోయింది. మెడికల్ కాలేజీ, మెట్రో విస్తరణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటివి బీఆర్ఎస్తోనే సాధ్యం..
రంగారెడ్డి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): ప్రజలే నా బలగం.. పార్టీ కేడరే నా బలం. తొమ్మిదేండ్లలో కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గుర్తిస్తున్నరు. మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడుతరు. కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడేది సెకండ్ ప్లేస్ కోసమే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని సీట్లు గెలిచి తీరుతాం. తొమ్మిదేండ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధే సీఎం కేసీఆర్ నాయకత్వ పఠిమకు నిదర్శనం. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ఆధారంగానే ప్రజలను ఓట్లు అడుగుతాం. మరోసారి టిక్కెట్ కేటాయించాక మాపట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది. రూ.2వేల కోట్లకు పైగా నిధులను వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులతో మహేశ్వరం నియోజకవర్గ ముఖచిత్రమే మారిపోయింది. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. అనుక్షణం వాళ్ల మధ్యే ఉంటున్నానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ వంటి కంపెనీల ఏర్పాటు, మెడికల్ కాలేజి, మెట్రో విస్తరణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి అంశాలు రానున్న ఎన్నికల్లో తన గెలుపునకు దోహదపడనున్నాయని తెలిపారు. ఇంకా మరెన్నో విషయాలను ఆమె ‘నమస్తే’తో పంచుకున్నారు. ఆ వివరాలు..
‘నమస్తే’ : ఎన్నికలకు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎలా సన్నద్ధమవుతున్నది?
మంత్రి : పార్టీ కేడర్, ప్రజలే మా బలగం. మా పార్టీ, మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే కాంక్షిస్తుంది. విజన్‌తో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నరు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాతోపాటు ప్రతి కార్యకర్త, ప్రజాప్రతినిధి కృషిచేస్తున్నరు. జిల్లాలో ఏ రాజకీయ పార్టీకీ లేనంత కార్యకర్తల బలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నేను ప్రతిక్షణం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా. వాళ్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నరు. ప్రస్తుతం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నేనే కాదు.. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులం గెలిచి తీరుతం. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తాం. తెలంగాణకు ముందు తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు కూడా గమనిస్తున్నరు. ఇక ఈసారి గెలిచేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్‌కు పోటీ ఎవరూ లేరు. కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నది రెండో స్థానం కోసమే.
‘నమస్తే’ : ఈసారి ఎన్నికల్లో మీ ప్రచార అస్ర్తాలేమిటి..?
మంత్రి : ఉమ్మడి జిల్లాలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తరలి వస్తున్నయి. ఫ్లైఓవర్లతో ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులు తీరాయి. రోడ్లను అభివృద్ధి చేసి కనెక్టివిటీని పెంచాం. ఎల్బీనగర్తోపాటు మరో మూడు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఏ వైద్య సాయం కావాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సుంకిశాల నుంచి కృష్ణా నీళ్లతోపాటు గోదావరి నీటిని తెచ్చి వచ్చే 50 ఏండ్ల నాటికి కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చేస్తున్నది. ఫాక్స్‌కాన్ కంపెనీతో లక్ష మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. శంషాబాద్‌కు మెట్రో విస్తరణ పనులకు సన్నాహాలు జరుగుతుండగా.. మహేశ్వరం, షాద్‌నగర్ వంటి ప్రాంతాలకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహేశ్వరంలో మెడికల్ కాలేజీ సైతం ఏర్పాటు కానున్నది. పాలమూరు-రంగారెడ్డితో త్వరలో సాగు, తాగునీటిపరంగా ఇబ్బందులు శాశ్వతంగా తీరనున్నయ్. ఔటర్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు మేలు చేకూర్చేలా ప్రణాళికలను రూపొందించుకుని కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నది. రానున్న ఎన్నికల్లో ఇవన్నీ.. మా గెలుపునకు దోహదపడనున్నాయి. ఇవే మా ప్రచారాస్ర్తాలు.
‘నమస్తే’ : ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలేమిటి?
మంత్రి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా బలం. మానిఫెస్టోలో చెప్పినవే గాక ఎవరూ అడగనివాటిని కూడా అమలు చేస్తున్నరు. 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష సాయం వంటి సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నాం. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నది. కుల సంఘాలకు స్థలాలు ఇచ్చి భవనాలను కూడా కట్టి ఇస్తున్నది. పేద విద్యార్థుల చదువుకు పెద్ద పీట వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది. పల్లె, బస్తీ దవాఖానలను పెద్దఎత్తున ఏర్పాటు చేయడం వల్ల అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఏ వ్యాధి వచ్చినా వైద్య సిబ్బంది ఇంటికే మందులను అందజేస్తున్నరు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. కేంద్రం ఆంక్షలు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ సాహసం చేసి మరీ పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం మరెక్కడా లేదు. వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ ప్రభావితం చేస్తాయి.
‘నమస్తే’ : పర్యటనల సందర్భంగా ప్రజల స్పందన ఎలా ఉంది?
మంత్రి : నా సొంత నియోజకవర్గమైన మహేశ్వరం ప్రజలు నాకు దైవ సమానం. వారి ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ప్రజల మద్దతు నాకు పుష్కలంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా అక్కలా.. అమ్మలా భావించి ఆప్యాయంగా చూసుకుంటరు. మేం బీఆర్ఎస్ జెండా పట్టుకుని ఏ ఊరికి వెళ్లినా.. ప్రజలకు అందులో సీఎం కేసీఆర్ కనబడుతరు. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తుంటుంది. నేను నిత్యం ప్రజల్లోనే ఉంటా. ఈ మధ్యనే నేను ఒకే రోజు 65 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా. బాగా పనిచేస్తున్నరు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటమని చెప్తుంటే.. అలసటను సైతం మర్చిపోతా. ఓ ఊరికి వెళ్లినప్పుడు ఓ రైతు తనకు ఉన్న ఎకరం భూమిని భార్య, కొడుకు పేరున గుంట చొప్పున చేసినట్లు చెప్పిండు. ఇదంతా రైతు బీమా కోసమని చెప్తే.. సీఎం కేసీఆర్ పథకాలపై ప్రజలకు ఎంత భరోసా ఉన్నదో అర్థమైంది. సుందరీకరించిన చెరువు ప్రాంతాల్లో ఉద్యోగాల శిక్షణలో భాగంగా ప్రాక్టీస్‌కు వచ్చే యువకులు చాలా బాగా ఉపయోగపడుతున్నదని చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంటుంది. నేను ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా.. వెంటనే నిధులు మంజూరు చేస్తుండడం నా అదృష్టం. నాపై విశ్వాసం ఉంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉంది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
‘నమస్తే’ : ప్రత్యేకించి మహేశ్వరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి?
మంత్రి : సీఎం కేసీఆర్ సారథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురవ్వకుండా ఎస్ఎన్డీపీలో రూ.110 కోట్లతో నాలాలను అభివృద్ధి చేశాం. ఇంకా రూ.30 కోట్లకు ప్రతిపాదనలు ఉన్నయి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 20 ఏండ్లుగా కోర్టు వివాదంలో ఉన్న సమస్యను ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించా. 12 ఎకరాల్లో ఫంక్షన్ హాల్, మున్సిపల్ భవనం, మైదానం, స్కూల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఒకే సముదాయంలో నిర్మించాం. ప్రస్తుతం క్యాంపు కార్యాలయం నిర్మించిన స్థలం గతంలో కోర్టు వివాదంలో ఉండె. అర్బన్ పార్కులతోపాటు రూ.50-రూ.60 కోట్ల వరకు వెచ్చించి చెరువులను సుందరీకరించడం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది నా ఆశయం. జూనియర్ కళాశాల, రెండు డిగ్రీ గురుకుల కళాశాలలు, పాలిటెక్నిక్, డైట్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రూ.14 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవనాన్ని నిర్మిస్తున్నాం. మన ఊరు- మన పాఠశాల కార్యక్రమంలో స్కూళ్ల ఆధునీకరణ, కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూల్ వంటి విద్యాశాఖ సంబంధిత వాటికే రూ.150 కోట్ల వరకు వెచ్చించాం. పెద్దఎత్తున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశాం. ఇటీవలనే అప్‌గ్రేడ్ అయిన సీనియర్ సివిల్ కోర్టు భవనాన్ని రూ.24 కోట్లతో నిర్మించబోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకే గడచిన తొమ్మిదేండ్లలో రూ.2వేల కోట్లకు పైగా వెచ్చించడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలతో కలిపి మొత్తం రూ.5వేల కోట్లకు పైనే ఉంటుంది.