పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం అల్లాడుతున్నది. ఏది తినాలన్నా, తాగాలన్నా అంతా కల్తీయే. జీవులు పీల్చుకునే ప్రాణవాయువు (ఆక్సిజన్) కూడా స్వచ్ఛంగా లభించడం లేదు. రసాయనాల వినియోగంతో తినే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అనారోగ్యానికి గురవుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇంటినే ఓ సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మార్చి పూలు, పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలను పండిస్తున్నారు. ఔషదమొక్కలను సైతం విరివిగా పెంచుతున్నది తాండూరు పట్టణం గ్రీన్‌సిటీ కాలనీకి చెందిన ముంతాజ్.
– తాండూరు, మే 6
తాండూరు పట్టణానికి చెందిన ముంతాజ్‌కు చిన్న నాటి నుంచే మొక్కలు పెంచడమంటే ఎంతో ఆసక్తి. దీంతో ఆమె ఇంటిని నందనవనంలా మార్చింది. పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలు ఇలా 500 రకరకాల మొక్కలను మేడపై, ఇంటి ముందు, ఇంటి వెనుక పెంచుతున్నది. అంతేకాకుండా తరిగిన కూరగాయలు, వాడిన టీపొడి, పండ్లు, నిమ్మ చెక్కలు, వాడిన పూలు తదితర వ్యర్థపదార్థాలను వృథాగా పడేయకుండా డ్రమ్ములో నిల్వచేసి వాటిని కంపోస్టు ఎరువుగా తయారు చేసి మొక్కలకు వేస్తున్నది. వేప నూనె కషాయాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నారు.
ముంతాజ్ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు మొక్కల పెంపకానికి కేటాయిస్తున్నది. మిద్దెపై పాలకూర, మెంతికూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాట, వంకాయ, బెండ, క్యారెట్, మిర్చి, గుమ్మడి, వెల్లుల్లి, చిక్కుడు, బీరకాయ, కాకరకాయ తదితర కూరగాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. మామిడి, నిమ్మ, దానిమ్మ, అంజీర, జామ, బొప్పాయి, ఉసిరి, అరటి తదితర పండ్లనూ పండిస్తున్నారు. బంతి, చేమంతి, గులాబీ, కనకాంబరాలు, మల్లేపూలు, కుంకుమబంతి, గన్నేరుతో పాటు పలురకాల పూల మొక్కలను పెంచుతున్నారు. ముఖ్యంగా మెడిసిన్‌కు సంబంధించిన తిప్పతీగ, నల్లేరు, లెమన్‌ట్రీ, పరిజాతం, ఇన్సులిన్ మొక్కలు, స్వీట్ లెమన్, రావి, మర్రి, మేడి, ఉసిరి, ఆడినియం మొక్కలను పెంచుతున్నారు. కరోనా సమయంలో ఇవి ఆరోగ్య రీత్యా చాలా ఉపయోగపడడంతో పాటు మెరుగైన ఆక్సిజన్ అందిస్తున్నాయని తెలుపుతున్నారు.
నిరుపయోగ వస్తువులే తొట్టెలు..
ఇంట్లో పనికి రాకుండా ఉన్న వస్తువులను ముంతాజ్ మొక్కలకు తొట్లుగా ఉపయోగిస్తున్నది. చిన్న డబ్బాలు, కుండలు, డ్రమ్ములు, పెట్టెలు, వాషింగ్ మిషన్, టీవీ, కూలర్, బైక్, సైకిల్, బట్టలు తదితరవి వృథాగా ఉన్న అన్ని వస్తువులను ఇంటి ముందు, మిద్దెపై మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పర్యావరణాన్ని కాపాడాలని చెబుతూ మొక్కను అందజేస్తున్నారు. దీంతో తాండూరు పట్టణంలోని పలువురు ముంతాజ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
పచ్చదనమంటే నాకు ప్రాణం..
నాకు చిన్ననాటి నుంచే మొక్కలను పెంచడం ఇష్టం. నా భర్త సహకారంతో 22 ఏండ్లుగా మొక్కలను పెంచడం వల్ల ఇల్లంతా తోటలా మారింది. కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు, పూలను సాగు చేస్తున్నా.
– ముంతాజ్