షాద్నగర్టౌన్, ఆగస్టు 24 : పూజల్లో ప్రథమ పూజ అందుకునే అధినాయకుడు గణనాథుడు. వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి యేటా జరుపుకొంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గణనాథుడి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం ఏర్పడుతుందని, దీంతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుంది. తెలంగాణ సర్కార్ మట్టి వినాయకులను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడి నిమజ్జనం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటుంది. షాద్నగర్లో వినాయక చవితికి వారం రోజుల ముందు నుంచే వినాయక ప్రతిమలను బుక్ చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలో వినాయక చవితి సందడి నెలకొంది.
పెరిగిన మట్టి వినాయకుల గిరాకీ
రంగుల వినాయకులకు తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులకు ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రతిమలు పర్యావరణ పరిరక్షణకు శ్రేయస్కరం అని తెలంగాణ సర్కార్ అవగాహన కల్పిస్తుండడంతో మట్టి వినాయకులకు గిరాకీ పెరిగింది.
రసాయనాలతో నీరు కాలుష్యం..
రకరకాల రసాయనాలతో కూడిన రంగులు, ఇనుము, నీటిలో కరగని పదార్ధాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలతో నీరు కలుషితం అవుతుందని, చెరువు మట్టి, బంక మట్టితో తయారు చేసిన వినాయకులతో నీరు శుద్ధికావడంతో పాటు నీటిలోని చేపలు, ఇతర ప్రాణులకు ఎలాంటి హాని ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు వివిధ యువజన సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడంతో పాటు మట్టి వినాయకుల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు.
ఉచిత పంపిణీకి సర్కార్ ప్రోత్సాహం
తెలంగాణ సర్కార్ మట్టి వినాయకులను ప్రోత్సహించడంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల కొనుగోలు పెరిగింది. ప్రస్తుతం మట్టి వినాయకుల తయారీతో ఎంతో మంది యువకులు లబ్ధిపొందుతున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని ఆనంద్నగర్కాలనీ చెందిన మల్లేష్ 12సంవత్సరాలుగా మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు. బంకమట్టి, చెరువు మట్టి, జనుపనారతో పాటు సాధారణ నీటి రంగులతో 6 ఇంచుల నుంచి 6ఫీట్ల వరకు మట్టి వినాయకుల ప్రతిమలను తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మట్టి వినాయక ప్రతిమలకు భారీ డిమాండ్ ఉంటుందని, భక్తుల అభిరుచులకు తగిన విధంగా గణనాధులను తయారు చేస్తున్నామని తెలిపారు.
వినాయకుల తయారీతో జీవనోపాధి
గత 12సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నా. మా కుటుంబ సభ్యులతో కలిసి మట్టి వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నా. ఇతర ప్రాంతాల నుంచి కూడా మాకు ఆర్డర్లు వస్తున్నాయి. మేము తయారు చేసే మట్టి వినాయకుడు నీటిలో కరిగిపోతాడు. నీటిలోని జీవరాశులకు ఎలాంటి హాని ఉండదు. ప్రభుత్వం నుంచి వినాయకుల తయారీకి రుణాలను అందిస్తే బాగుటుంది.
– మల్లేశ్, మట్టి వినాయకుడి తయారీదారి షాద్నగర్