దోమ, జూన్ 15 : ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ అనసూయ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమంతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజల సాధారణ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులతో పాటు ప్రత్యేక అధికారులు దృష్టి సారించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
గ్రామ పంచాయతీల్లో నిధులు లేక పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని ఎంపీవో సోమలింగం సభ దృష్టికి తీసుకొచ్చారు. సభలో బొంపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు పిల్లలు ఉన్న ఎంపీటీసీని సమావేశానికి ఎందుకు అనుమతిచ్చారని మాజీ సర్పంచ్ సురేశ్ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఎంపీపీ, వైస్ ఎంపీపీ జోక్యం చేసుకొని ఎన్నికల కమిషన్, కోర్టు ద్వారా తేల్చుకోవాలని సూచించారు. అనవసర విషయాలతో ఇక్కడ రాద్దాంతం చేయరాదని సురేశ్‌ను సభ నుంచి బయటికి పంపారు. సమావేశంలో ఎంపీడీవో మహేశ్‌బాబు, తహసీల్దార్ పురుషోత్తం, కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైస్ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ.. పలు గ్రామాల్లో రోడ్ల పనులను ప్రారంభించి ఇప్పటికీ పూర్తి చేయలేక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయా శాఖల అధికారులను ప్రశ్నించారు. ఆ పనులకు సంబందించిన టెండర్లు రద్దయ్యాయని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ డబ్బులు చాలా మంది రైతులకు రావడం లేదని ఆయన ఏవోను అడగగా 2019 తర్వాత పాసు బుక్కులు వచ్చిన వారికి రావడం లేదని ఆయన బదులిచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతులు 95 శాతం పూర్తయ్యాయని ఎంఈవో హరిశ్చందర్ తెలిపారు. గ్రామాల్లో నీటి సరఫరా కోసం ఎస్డీఎఫ్ ఫండ్ కింద మండలానికి రూ.25లక్షలు, గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.15 లక్షలు మంజూరయ్యాయని మిషన్ భగీరథ ఏఈ పేర్కొన్నారు.
రాజకీయ కోణంలో ఎదుర్కోలేకనే ఎంపీటీసీ రాములుపై మాజీ సర్పంచ్ సురేశ్ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని వైస్ ఎంపీపీ మల్లేశం, ఎంపీటీసీ రాములు పేర్కొన్నారు. దోమ మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ముగురు పిల్లలు అనే విషయం 2013 నుంచి 2016 వరకు కోర్టులో కేసు కొనసాగిందన్నారు. రాములుకు ముగ్గురు పిల్లల విషయంలో కోర్టు అనుకూలమై తీర్పు ఇచ్చిందన్నారు. లేని పోని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, అంజి తదితరులు పాల్గొన్నారు.